Jharkhand: జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా, చాయిబాసాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. చాయిబాసాలోని సదర్ ఆసుపత్రిలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించినట్లు తేలింది. దీనిపై జార్ఖండ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించి, విచారణకు ఆదేశించడంతో రాంచీ నుంచి ఆరోగ్య శాఖ బృందం విచారణ కోసం చాయిబాసా చేరుకుంది. రాంచీ నుంచి వచ్చిన వైద్యుల బృందం తొలుత సదర్ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూన(PICU)ని తనిఖీ చేసింది. జార్ఖండ్ ఆరోగ్య సేవల డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల దర్యాప్తు కమిటీ ఈ కేసును విచారిస్తోంది. బాధితులందరి వయసు 15 ఏళ్ల లోపే ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం రోజుల్లో 56 మంది తలసేమియా బాధితులకు పరీక్షలు చేయగా.. వారిలో ఐదుగురు పిల్లలకు హెచ్‌ఐవీ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది.
Shah Rukh : ‘దిల్ సే’ నుంచి ‘ఓం శాంతి ఓం’ వరకు.. షారుఖ్ బర్త్‌డే రీ-రిలీజ్ వేడుకలు
ప్రాథమిక విచారణలో అనేక తీవ్రమైన నిర్లక్ష్యాలు, బ్లడ్ బ్యాంకులో కూడా లోపాలు, అవకతవకలు బయటపడ్డాయి. దర్యాప్తు పూర్తయిన తర్వాత సమగ్ర నివేదికను రాష్ట్ర ఆరోగ్య విభాగానికి కమిటీ సమర్పిస్తుంది. చాయిబాసాకు చెందిన ఏడేళ్ల తలసేమియా బాధితుడి తండ్రి పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తమ బిడ్డకు సదర్ ఆసుపత్రిలో హెచ్‌ఐవీ పాజిటివ్ రక్తం ఎక్కించారని ఆయన ఆరోపించారు. తల్లిదండ్రులు ఇద్దరూ తమకు పరీక్షలు చేయించుకోగా, వారికి నెగెటివ్ వచ్చింది. కానీ తలసేమియా బాధితుడైన తమ బిడ్డకు మాత్రం పాజిటివ్ వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
JR NTR : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్
ఈ కేసును హైకోర్టు కూడా పరిగణనలోకి తీసుకుని విచారణకు ఆదేశించింది. దీంతో ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల దర్యాప్తు బృందం శనివారం చాయిబాసా సదర్ ఆసుపత్రికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తు బృందం ప్రకారం, తలసేమియా బాధితులైన పిల్లలకు హెచ్‌ఐవీ పాజిటివ్ రావడానికి రెండు కారణాలు ఉండొచ్చని పేర్కొంది. అందులో ఒకటి వారికి కలుషితమైన రక్తం ఎక్కించడం లేదా ఇతర కారణాల వల్ల వారి శరీరంలోకి సంక్రమణ కావడం. అయితే, దర్యాప్తు సమయంలో సదర్ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్, ల్యాబ్‌లో అనేక లోపాలు, అవకతవకలు కనుగొనబడ్డాయి. విచారణ పూర్తయిన తర్వాతే పిల్లలకు ఇలా జరగడానికి కారకులు ఎవరో స్పష్టమవుతుంది. ఇక ఈ ఘటనపై రాజకీయాలు కూడా మొదలయ్యాయి. భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర ప్రతినిధి అజయ్ షా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ.. “ఇప్పుడు జార్ఖండ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులు జీవితాన్ని కాకుండా మరణాన్ని పంచుతున్నాయి. ఈ ఘటన జార్ఖండ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితిపై, ఆరోగ్య శాఖ పనితీరుపై మరోసారి తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది” అని విమర్శించారు.
