Notifications Cancelled: సంచలన నిర్ణయం తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. 44 నియామక పరీక్షలు రద్దు..

Psc

Psc

జార్ఖండ్ ప్రభుత్వం 2014 నుంచి నిర్వహించిన ఏకంగా 44 ప్రభుత్వ నియామక పరీక్షలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (JSSC), టీడీపీఎల్ అనే ఏజెన్సీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. ముఖ్యంగా జేఎస్ఎస్‌సీ-సీజీఎల్ (JSSC-CGL) పరీక్ష రద్దు నిర్ణయంపై తీవ్ర కలకలం రేగింది. ఈ రద్దు నిర్ణయంతో అప్పటికే ఎంపికై, వివిధ ప్రభుత్వ శాఖల్లో బాధ్యతలు స్వీకరించిన దాదాపు 2,000 మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పారదర్శకంగా ఎంపికైన తమను కూడా అక్రమార్కులతో కలిపి శిక్షించడం సరికాదని, రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాంచీలోని సెక్రటేరియట్ నుంచి బిర్సా చౌక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఈ వివాదం వెనుక సీఐడీ (CID) చేపట్టిన సమగ్ర దర్యాప్తు కీలక పాత్ర పోషించింది. కీలక నిందితుడైన అభయ్ తివారీ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయడంతో పాటు, వివిధ పరీక్షల్లో పాస్ అవ్వడానికి రూ. 2 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు రేట్ చార్టులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కేసులో ఇప్పటివరకు 22 మందిని అరెస్టు చేశారు.

ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సమర్థిస్తూ.. నియామక వ్యవస్థపై నిరుద్యోగుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో సమగ్ర సంస్కరణల కోసం సీనియర్ ఐఏఎస్ అధికారి అమితాబ్ కౌశల్ ఆధ్వర్యంలో సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. అటు ప్రతిపక్ష నాయకుడు బాబులాల్ మరాండీ మాత్రం సీబీఐ దర్యాప్తు జరపకుండా ప్రభుత్వం పరీక్షలను రద్దు చేయడం విద్యార్థులను మోసం చేయడమేనని విమర్శించారు. ఒకవైపు పారదర్శక వ్యవస్థ కోసం పోరాడుతున్న నిరుద్యోగుల డిమాండ్లు, మరోవైపు అప్పటికే ఉద్యోగాలు సాధించి రోడ్డున పడ్డ వేలాది మంది బాధితుల భవిష్యత్తు మధ్య జార్ఖండ్ ప్రభుత్వం ఇప్పుడు సవాలును ఎదుర్కొంటోంది.