NTV Telugu Site icon

Jasprit Bumrah Injury: ఇంగ్లండ్‌తో సిరీస్‌.. జస్ప్రీత్ బుమ్రా ఔట్!

Jasprit Bumrah

Jasprit Bumrah

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భారత్ 1-3తో ఓడిన విషయం తెలిసిందే. ఈ ట్రోఫీలో టీమిండియా తరఫున స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. ఐదు టెస్టుల్లో 32 వికెట్స్ పడగొట్టి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు. అయితే వెన్ను గాయం కారణంగా చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌ చేయలేదు. బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా 150కి పైగా ఓవర్లు వేశాడు. ఎక్కువ పనిభారమే అతడి వెన్ను నొప్పికి కారణమని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది.

ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్న భారత్ ఫాస్ట్‌బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లోని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశముంది. బుమ్రాకు తగిన విశ్రాంతిని ఇచ్చి.. ఫిబ్రవరి 19న ఆరంభమయ్యే ఛాంపియన్స్‌ ట్రోఫీకి తాజాగా ఉంచాలని టీమిండియా మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025కి అతడిని సిద్ధం చేయడానికి బీసీసీఐ వైద్య బృందం కసరత్తులు చేస్తోంది. ఎందుకంటే ఛాంపియన్స్‌ టోర్నీలో టీమిండియాకు బుమ్రా ఎంతో కీలకం. ఫిబ్రవరి 20న దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది.

జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి తీవ్రతను బీసీసీఐ వైద్య బృందం ఇంకా అంచనా వేయలేదని తెలుస్తోంది. గాయం గ్రేడ్‌ 1 విభాగంలో ఉంటే కోలుకోవడానికి కనీసం 2, 3 వారాలు పడుతుంది. గ్రేడ్‌ 2 అయితే 6 వారాలు పట్టొచ్చు. ఇక గ్రేడ్‌ 3 అయితే మాత్రం విశ్రాంతి, పునరావాస కార్యక్రమానికి దాదాపుగా మూడు నెలల సమయం పడుతుంది. బుమ్రాకు అయిన గాయం తీవ్రత ఆధారంగా అతడు ఎప్పుడు బరిలోకి దిగుతాడా అన్నది తేలనుంది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో భారత్ 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. జనవరి 22న టీ20 సిరీస్ మొదలవుతుంది.

Show comments