Jani Master Case Updates: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. గురువారం గోవా కోర్టు అనుమతితో జానీ మాస్టర్‌ను హైదరాబాద్‌కు పోలీసులు తరలించారు. మాస్టర్‌ను రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు. నేడు సైబరాబాద్ పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం జానీ నార్సింగి పోలీసుల అదుపులో ఉన్నాడు.
జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో అవుట్ డోర్‌లో షూటింగ్ చేస్తున్న సమయంలో జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. కొన్నిసార్లు తనపై దాడులు కూడా చేశాడని మహిళా అసిస్టెంట్ ఇటీవల రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. నార్సింగి పోలీసు స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాధితురాలి నుంచి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అత్యాచారం జరిగినప్పుడు ఆమె మైనర్ అని వెల్లడి కావడంతో.. జానీపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Also Read: Sara Ali Khan: జాన్వీ కపూర్ బాటలో సారా అలీ ఖాన్.. సరైన కథ కోసం ఎదురుచూపు!
కేసు నమోదైనప్పటి నుంచి జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు. నెల్లూరు, నార్త్ ఇండియా స్టేట్స్‌కు వెళ్లాడని వార్తలు వచ్చాయి. జానీని పట్టుకునేందుకు సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు నాలుగు బృందాలుగా రంగంలోకి దిగారు. 4-5 రోజులుగా పరారీలో ఉన్న అతడిని గోవాలోని ఓ లాడ్జిలో అదుపులోకి తీసుకున్నారు. స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి.. ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం జానీ నగర శివారులోని ఓ ఫాంహౌజ్‌లో ఉన్నట్టు సమాచారం. జానీని రహస్య ప్రదేశంలో ఉంచి.. పోలీసులు విచారిస్తున్నారు. గోవా కోర్టు ఆదేశాల మేరకు నేడు అతడిని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరుచనున్నారు.