Site icon NTV Telugu

TV Rama Rao: జనసేన ఇంచార్జి పదవి నుంచి టీవీ రామారావు ఔట్!

Tv Rama Rao

Tv Rama Rao

జనసేన కొవ్వూరు నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావును అధిష్టానం తప్పించింది. ఈ మేరకు పార్టీ కాప్లిక్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కొవ్వూరు నియోజకవర్గంలోని సహకార సొసైటీల నియామకాల్లో అన్యాయం జరిగిందని టీవీ రామారావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. కొవ్వూరు టోల్ గేట్ వద్ద రాస్తారోకో నిర్వహించారు.

కొవ్వూరు నియోజకవర్గంలోని 14 సొసైటీలు ఉండగా.. దీనిలో మూడు పదవులు తమకు కేటాయించాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. అయితే జనసేన పార్టీని సంప్రదించకుండా.. కేవలం ఒక సొసైటీ పదవే కేటాయించారని జనసేన కొవ్వూరు ఇంచార్జి టీవీ రామారావు ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ సీరియస్‌గా తీసుకుంది. పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడం పార్టీ దృష్టికి వచ్చిందని, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని లేఖలో పేర్కొన్నారు.

Also Read: Kanakadurgamma Temple: ప్లేట్ కలెక్షన్ నిలిపివేత.. ఇంద్రాకిలాద్రిపై పంతుళ్ల లొల్లి!

2009లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా టీవీ రామారావు గెలుపొందారు. ఓ కేసు కారణంగా రాజకీయ ఒడుదుడుకులకు గురైన ఆయనకు మరోసారి టికెట్ దక్కలేదు. 2014లో కేఎస్ జవహర్‌కు మద్దతుగా ప్రచారం చేసి టీడీపీ విజయానికి పాటుపడ్డారు. 2019లో కూడా టికెట్ రాలేదు. దీంతో అదే ఏడాది వైసీపీలో చేరారు. కొవ్వూరు నుంచి పోటీ చేసిన తానేటి వనితకు మద్దతుగా నిలిచారు. 2023లో వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు.

Exit mobile version