Site icon NTV Telugu

Janasena: గాజు గ్లాసు గుర్తు కోల్పోయిన జనసేన.. ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చిన ఈసీ

Janasena

Janasena

Janasena: ఏపీలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ ఝలక్ ఇచ్చింది. ఆ పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను ఈసీ తాజాగా వెల్లడించింది. ఏపీలో వైసీపీ, టీడీపీ గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో నిలిచాయి. టీడీపీ, వైసీపీ కూడా తెలంగాణలో ఎంఐఎం, బీఆర్ఎస్ తో పాటు గుర్తింపు పొందిన పార్టీలుగా నిలిచాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పార్టీలకు గతంలో కేటాయించిన గుర్తులనే రిజర్వ్ చేయనున్నట్లు ఈసీ తెలిపింది. అయితే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన పార్టీ మాత్రం గతంలో పొందిన గాజు గ్లాస్ సింబల్ ను కోల్పోయింది. ఆ గుర్తును ఈసీ ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. జనసేన పలు ఎన్నికలకు దూరంగా ఉండడం వల్లే తన గుర్తును కోల్పోవాల్సి వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసే ఏ పార్టీ అయినా తమకు కేటాయించిన గుర్తును నిలుపుకోవాలంటే నిబంధనల ప్రకారం ఓట్ల శాతాన్ని తెచ్చుకోవాలి. అయితే జనసేన పార్టీ పలు ఉప ఎన్నికలకు దూరంగా ఉండటంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలా తక్కువచోట్ల పోటీ చేసింది. ఈ కారణంగానే జనసేన తన గుర్తును కోల్పోయింది.

Read Also: Thursday Stotram: అఖండ పుణ్యఫలం, సంతానవృద్ధి కలగాలంటే ఈ స్తోత్రం వినండి

జనసేన గుర్తు అయిన గాజు గ్లాస్ ను ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చినట్లు ఇప్పుడు ఈసీ ప్రకటించినప్పటికీ కొన్ని నెలల కిందట జరిగిన బద్వేలు ఉప ఎన్నిక సమయంలోనే పార్టీ ఆ గుర్తును కోల్పోయింది. బద్వేలు ఉప ఎన్నికలో జనసేన పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చింది. దీంతో నవతరం పార్టీ అభ్యర్థికి ఈసీ గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేనకు ఈసీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించగా.. ఆ పార్టీ శ్రేణులు సింబల్ ను జనాల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లారు. పవన్ కళ్యాణ్ కూడా తాను నటించే సినిమాల్లో ఏదో ఒక సందర్భంలో గాజు గ్లాస్ ను ప్రదర్శిస్తూ వచ్చారు. ఈ విధంగా గాజు గ్లాస్ అంటే జనసేన పార్టీ సింబల్ గా ప్రజల్లో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఈసీ ఆ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడంతో జనసేనకు షాక్ తగినట్లయింది. వచ్చే ఎన్నికల్లో ఈసీ జనసేనకు మళ్ళీ గాజు గ్లాస్ గుర్తు కామన్ గా ఇస్తే పర్వాలేదు, లేకపోతే భారీగా నష్టం జరిగే అవకాశం ఉంది.

Read Also: DC vs PBKS: ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పంజాక్ కింగ్స్ పరాజయం

Exit mobile version