తమిళ సూపర్ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం పార్టీ (TVK) అధినేత విజయ్ నటించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘జన నాయగన్‘. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి అడుగుపెట్టాల్సిన ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. రాజకీయపరమైన సన్నివేశాలు మరియు కొన్ని సున్నితమైన అంశాల కారణంగా సెన్సార్ బోర్డు వద్ద నిలిచిపోయింది. తాజాగా రివైజింగ్ కమిటీ సినిమాను తిరిగి వీక్షించడంతో ఈ రోజు లేదా రేపటిలోగా సర్టిఫికెట్ చేతికి వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. బోర్డు సూచించిన మార్పుల తర్వాత ‘UA’ సర్టిఫికెట్ లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సెన్సార్ అడ్డంకులు తొలగిపోతే సినిమాను వీలైనంత త్వరగా థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు KVN ప్రొడక్షన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మే 7న లేదా మే 14న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీక్ అయినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మే రెండో వారంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ కృతనిశ్చయంతో ఉంది. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేసిన చివరి సినిమా కావడంతో దీనిపై రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. సెన్సార్ క్లియరెన్స్ లభించిన వెంటనే భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించి సమ్మర్ కానుకగా బాక్సాఫీస్ వద్ద సందడి చేయాలని దళపతి అభిమానులు ఆశిస్తున్నారు. సెన్సార్ ప్రక్రియ క్లైమాక్స్‌కు చేరుకుంది. సెన్సార్ బోర్డు (CBFC) అధికారులు ఈ చిత్రాన్ని మరోసారి క్షుణ్ణంగా సమీక్షించిన నేపథ్యంలో నేడు సెన్సార్ సర్టిఫికెట్‌పై అధికారిక ప్రకటన వెలువడనుండడంతో విజయ్ ఫ్యాన్స్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
