Jammu & Kashmir Cloudburst: జమ్మూ కాశ్మీర్‌లోని చాషోటి ప్రాంతంలో గురువారం క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. భారీ వరదల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం. సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాద స్థలం నుంచి యాత్రికులను ఖాళీ చేయిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. చాషోటి మచైల్ మాతా యాత్రకు ప్రారంభ స్థలం, కిష్త్వార్‌లోని హిమాలయ మాతా చండి మందిరానికి వెళ్లే మార్గంలో ఈ వరదలు సంభవించినట్లు తెలిసింది. ఈ ఆకస్మిక వరదల్లో 33 మందికి పైగా చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం.
READ MORE: Sanju Samson: సంజు శాంసన్.. వర్కౌట్ కాదు! యాష్ ఆసక్తికర వ్యాఖ్యలు
సహాయక చర్యలను ముమ్మరం చేయాలి..
చషోతి కిష్త్వార్‌లో కుంభవృష్టితో సంభవించిన ఆకస్మిక వరదల విషయంపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు. విషయం తెలిసిన వెంటనే తీవ్ర వేదనకు గురైనట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. వరదల్లో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ప్రమాద స్థలంలో రక్షణ, సహాయ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని, బాధితులకు సాధ్యమైన అన్ని సహాయాలు అందించాలని పౌర, పోలీసు, సైన్యం, NDRF, SDRF అధికారులను ఆదేశించారు.
ఘటనపై జమ్మూ కాశ్మీర్ ఉధంపూర్ ఎంపీ, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. భారీ స్థాయిలో తుఫాను సంభవించడంతో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం ఏర్పడే అవకాశం ఉందన్నారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. అధికారులు కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. ఇప్పటికే వారు ప్రమాద స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపారు. వైద్య చికిత్స కోసం హెలి-రెస్క్యూ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అతి త్వరలో మరిన్ని వివరాలు తెలుస్తామన్నారు.
ఘటనపై డిప్యూటీ కమిషనర్ కిష్త్వార్ పంకజ్ శర్మ స్పందించారు. మచైల్ మాతా యాత్ర ప్రారంభ స్థానం అయిన కిష్త్వార్‌లోని చషోటి ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించాయన్నారు. ఇప్పటికే సహాయక చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.
