NTV Telugu Site icon

Anderson-Broad: అండర్సన్-బ్రాడ్ జోడీ అదిరిపోయే రికార్డు.. 1000 వికెట్లతో!

22

22

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ అదరగొడుతోంది. మొదట బ్యాటింగ్‌లో దుమ్మురేపిన ఆ జట్టు బౌలింగ్‌లోనూ ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తోంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌ పేస్ జోడీ జేమ్స్‌ అండర్సన్‌- స్టువర్ట్‌ బ్రాడ్‌ అరుదైన రికార్డు తమ ఖాతాలో వేసుకుంది. టెస్టు క్రికెట్‌లో సంయుక్తంగా 1000 వికెట్లు పడగొట్టిన బౌలర్ల జంటగా చరిత్రకెక్కింది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు రెండో రోజు ఆటలో ఈ ఘనత సాధించింది. తద్వారా సుదీర్ఘ ఫార్మాట్‌లో ఈ ఫీట్‌ నమోదు చేసిన రెండో బౌలర్ల జంటగా నిలిచింది. గతంలో ఆస్ట్రేలియా దిగ్గజ ద్వయం గ్లెన్‌ మెక్‌గ్రాత్- షేన్‌ వార్న్‌ 1000 వికెట్ల రికార్డు నెలకొల్పారు. మెక్‌గ్రాత్- స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ 104 టెస్టు మ్యాచ్‌ల్లో కలిసి సంయుక్తంగా 1001 వికెట్లు పడగొట్టి ఆండర్సన్‌- బ్రాడ్‌ జంట కంటే ముందుగా ఈ ఘనత సాధించారు.

Also Read: INDvsAUS 2nd Test: ఖవాజా ఫిఫ్టీ.. లంచ్ బ్రేక్ సమయానికి ఆసీస్ 94/3

కివీస్‌తో మొదటి టెస్టు తొలి రోజు ఆటలో అండర్సన్‌ రెండు వికెట్లు తీయగా.. బ్రాడ్‌ మాత్రం ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. అయితే, రెండో రోజు మొదటి సెషన్‌లో బ్రాడ్‌ నైట్‌ వాచ్‌మన్‌ నీల్‌ వాగ్నర్‌ వికెట్‌ పడగొట్టాడు. దీంతో అండర్సన్‌- బ్రాడ్‌ జంట 1000 వికెట్ల క్లబ్‌లో చేరింది. ఇక అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌ టెస్టుల్లో టాప్‌-5 వికెట్‌ టేకర్ల జాబితాలో కొనసాగుతున్నారు. 178 టెస్టుల్లో 40 ఏళ్ల అండర్సన్‌ 677 వికెట్లు పడగొట్టగా.. 36 ఏళ్ల బ్రాడ్‌ 160 మ్యాచ్‌లలో 567 వికెట్లు తీశాడు. శ్రీలంక లెజెండ్‌ ముత్తయ్య మురళీధరన్‌ అత్యధికంగా 800 వికెట్లు, షేన్‌ వార్న్‌ ఖాతాలో 708 వికెట్లు ఉన్నాయి. భారత దిగ్గజ బౌలర్‌ అనిల్‌ కుంబ్లే 619 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. మౌంట్‌ మాంగనీయ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో మొదటి టెస్టులో ఇంగ్లండ్‌ 325/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయగా.. కివీస్ 306 రన్స్ చేసి ఆలౌటైంది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌కు 19 రన్స్ లీడ్ లభించింది.

Also Read: John Wich 4: ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా…

Show comments