Site icon NTV Telugu

Jala Harathi Corporation: సీఎం ఛైర్మన్‌గా జలహారతి కార్పొరేషన్‌..

Polavaram

Polavaram

Jala Harathi Corporation: పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టు చేపట్టేందుకు జలహారతి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కంపెనీల చట్టం కింద వంద శాతం ప్రత్యేక వాహక సంస్థగా జలహారతి కార్పొరేషన్ ఉండనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చైర్మన్ గా జల హారతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.. వైస్ ఛైర్మన్ గా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉంటారు.. సంస్థ సీఈవోగా జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు ఆధ్వర్యంలో విధులు నిర్వర్తిస్తారు. పోలవరం ప్రాజెక్టు నుంచి వరద జలాలను తరలించేలా పోలవరం – బనకచర్ల లింకు ప్రాజెక్టు పై దృష్టి పెట్టింది ఏపీ సర్కార్..

Read Also: RBI Policy: ఆర్బీబీ శుభవార్త.. వడ్డీ రేట్లు తగ్గింపు.. ఈఎంఐలు తగ్గే ఛాన్స్

80 లక్షల మందికి తాగునీటిని అందించేలా పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. కొత్తగా 3 లక్షల హెక్టార్ల ఆయకట్టు సాగులోకి వస్తుందని ప్రభుత్వ అంచనా వేస్తోంది.. 9.14 లక్షల హెక్టార్ల కు నీటిని ఇవ్వటంతో పాటు 20 టీఎంసీల మేర పరిశ్రమలకు ఇవ్వొచ్చని స్పష్టం చేస్తోంది.. ఈ ప్రాజెక్టుకు రూ.80,112 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేస్తోంది ప్రభుత్వం.. గోదావరి బేసిన్ లో వృథాగా పోతున్న వరద జలాలను లోటు ఉన్న ప్రాంతాలకు తరలించేలా లింకు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.. పల్నాడు జిల్లా బొల్లాపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి బనకచర్ల రెగ్యులేటర్ వరకు నీటిని తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. దాదాపు 150 టీఎంసీల వరకూ నీటిని తరలించేందుకు ఆస్కారం ఉందని లోటు ఉన్న జిల్లాలకు ఈ వరద జలాలను వినియోగించుకోవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది.. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉండే రాయలసీమ జిల్లాలకు నీటిని అందించేలా ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుందంటున్నారు.. పోలవరం – బనకచర్ల రెగ్యులేటర్ కు కాలువలు, ఎత్తిపోతల పథకాలు, భూగర్భ పైప్ లైన్లు, సొరంగాల ద్వారా నల్లమల నుంచి నీటిని తరలించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.. దీనికోసం ఓ ప్రత్యేక వాహక సంస్థగా జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా దీనిని తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రయత్నాలుగా ఉన్నాయి.. ఎస్పీవీగా బహిరంగ మార్కెట్ల నుంచి నిధులు సేకరించేందుకు అవకాశం ఉందని వెల్లడించారు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్..

Exit mobile version