Site icon NTV Telugu

Crime News: అసూయ, పగ, ప్రతీకారం.. ఉన్మాదులుగా మారుతున్న మనుషులు! ఈ చిన్నమ్మే ఉదాహరణ

Jagtial Murder

Jagtial Murder

అసూయ, పగ, ప్రతీకారం మనుషుల్ని ఉన్మాదులుగా మార్చుతున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన చిన్నారి హత్యే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. సొంత చిన్నమ్మే ఆ చిన్నారిని చిదిమేసింది. ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న చిన్నారి పేరు హితిక్ష. తండ్రి రాములు దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి నవీనతో కలిసి కోరుట్లలో ఆదర్శనగర్‌లో ఉంటుంది హితిక్ష. ఈ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పక్కింట్లో ఉన్న బాత్‌రూమ్‌లో గొంతు కోసి దారుణంగా హతమార్చారు.

సాయంత్రం వరకు ఇంటి వద్దే ఆడుకున్న చిన్నారి రాత్రి అయ్యే సరికి కనిపించలేదు. దీంతో ఆమె తల్లి, కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. తెలిసిన చోటల్లా వెతికారు. కానీ ఎక్కడా దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు సాయంతో వెతుకుతుండగా.. పక్కింట్లోని బాత్‌రూమ్‌లోనే చిన్నారి హితిక్ష రక్తపు మడుగులో పడి ఉంది. అది చూసిన తల్లి, కుటుంబ సభ్యులకు పై ప్రాణాలు పైనే పోయినంత పనయింది. ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దారుణంగా గొంతు కోసి హత్య చేయడంతో వారికి కాళ్లూ చేతులూ ఆడలేదు. వెంటనే హితిక్షను ఆస్పత్రికి తరలించారు.

తొలుత చిన్నారి హితిక్ష పడి ఉన్న ఇంటి యజమాని కొడుపల్లి విజయ్‌ హత్య చేసినట్లు భావించారు. దీంతో అతనికి కాల్ చేశారు. తాను వరంగల్ జిల్లా నర్సంపేట్‌లో ఉన్నట్లు చెప్పాడు విజయ్. అతను నర్సంపేటలో ఉంటే బాలిక మృతదేహం అతని ఇంట్లోని బాత్‌రూంలోకి ఎలా వచ్చిందన్న సందేహాలు వచ్చాయి. హితిక్ష దారుణ హత్య కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. ఘటనా స్థలం దగ్గర జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. అవి హితిక్ష ఇంటిలోకే వెళ్లి నిలిచిపోవడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఇంట్లో ఉన్న వారి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని పరిసరాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఇంట్లోకి వచ్చిపోయే వారి వివరాలు సేకరించారు.

ఓ వైపు జగిత్యాల జిల్లా ఆస్పత్రిలో చిన్నారి హితిక్ష డెడ్ బాడీకి పోస్టుమార్టం జరుగుతోంది. చిన్నారి మృతితో తల్లి నవీన, కుటుంబ సభ్యుల ఆక్రందనలు ఆస్పత్రి ఆవరణలో మిన్నంటాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న హితిక్ష కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో అంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అందులో ఓ మహిళ కూడా చిన్నారి హితిక్ష కోసం బాగా ఏడుస్తోంది. ఎక్కి ఎక్కి ఏడుస్తున్న ఆ మహిళ పేరు మమత. ఈమె సాదాసీదా మహిళ కాదు.. జగత్ కంత్రీ కిలాడీ. యస్.. అలా ఎందుకు చెబుతున్నామంటే.. ఆ చిన్నారి హితిక్షను దారుణంగా మర్డర్ చేసి.. ఏం తెలియని నంగనాచిలా ఇక్కడ అందరి ముందూ ఏడుస్తూ డ్రామా ఆడుతోందని పోలీసులు నిర్ధారించారు.

ఇక అసలు విషయానికి వస్తే.. పోలీసులు డాగ్ స్క్వాడ్ తో విచారణ చేయగా.. మమత ఇంటి వద్ద జాగిలాలు ఆగాయి. దీంతో ఆ దిశగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులు మరింత లోతుగా విచారించారు. చిన్నారి హితిక్ష తల్లి నవీనకు మమత తోడి కోడలు అవుతుంది. నవీన భర్త రాములు తమ్ముని భార్య. అంటే హితిక్షకు పిన్ని అవుుతుంది. చాలా రోజుల నుంచి నవీనతో మమతకు తీవ్రస్థాయిలో మనస్పర్థలు ఉన్నాయి. ఈ విషయం తెలియడంతో పోలీసులు మమతను అనుమానించారు. మమత సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుని పరిశీలించారు పోలీసులు. దీంతో విస్తుపోయే నిజం బయటపడింది. హత్య చేయడానికి అవసరమైన కొన్ని వీడియో క్లిప్పింగ్‌లు గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేసినట్లు గుర్తించారు. అంతే కాదు హత్య జరిగిన ప్రాంతంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. మమత సాయంత్రం 6.30 నుంచి మృతదేహం దొరికే వరకు ఐదు సార్లు ఎక్కడికో వెళ్లి తిరిగి వచ్చినట్లు గుర్తించారు.

మరోవైపు ఈ కేసులో పోలీసులకు సీసీ ఫుటేజీలు కీలకంగా మారాయి. హితిక్ష హత్య తర్వాత మమత.. తాను కట్టుకున్న చీరను మార్చుకుని పంజాబీ డ్రెస్ వేసుకున్నట్లు సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. హత్య జరిగిన ఇంటి నుంచి ఓ కవర్ పట్టుకుని బయటకు వస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అంతే కాదు ఇంటి నుంచి బయటకు వెళ్లిన మమత ఆటోలో కిలోమీటర్ వరకు వెళ్లి జాతీయ రహదారి పక్కన ఓ వీధిలో హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు రక్తపు మరకలు అంటిన చీరను పడేసింది. పూర్తిగా మమతే హత్య చేసినట్లు నిర్ధారించుకున్న పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీంతో హితిక్ష కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అప్పటి వరకు తమతోనే ఉండి చిన్నారి కోసం ఏడ్చిన మహిళే హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో అంతా హతాశులయ్యారు. ఎవరికీ నోట మాట రాలేదు. మమతను పోలీసులు అదుపులోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించారు. నిందితురాలితో పాటు వెళ్లి … హత్యకు ఉపయోగించిన ఆయుధం కత్తి, హత్య సమయంలో ధరించిన రక్తం మరకలు అంటిన చీరను స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Pocso Act: మైనర్ బాలికపై కన్నేస్తే.. ఏళ్ల తరబడి చిప్ప కూడే! పోకిరీలు జర జాగ్రత్త

హితిక్ష హత్య వెనుక వ్యక్తిగత వైరం, ఆస్తి తగాదా లేదా ఇతర కారణాలపై దర్యాప్తు చేశారు పోలీసులు. దీంతో మమత విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. చిన్నారి హితిక్ష కుటుంబానికి దక్కుతున్న గౌరవం తమకు దక్కడం లేదని మమత ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు తెలిసింది. కుటుంబంలో గౌరవం దక్కడం లేదని మమత పగ పెంచుకుంది. హితిక్ష తల్లిదండ్రులపై కోపంతోనే పాపను పొట్టనపెట్టుకుంది. మరోవైపు మమత ఆన్‌లైన్‌ గేమ్స్‌తో పాటు బిట్‌ కాయిన్‌లో పెట్టుబడి పెట్టి రూ.25లక్షలు పోగొట్టుకున్నట్టు పోలీసుల విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది. దుబాయ్‌లో నవీన భర్త, మమత భర్త ఇక్కడికి డబ్బులు పంపిస్తుంటే.. నవీన సేవింగ్స్ చేసి పెట్టుకుంది. కానీ దానికి భిన్నంగా మమత మాత్రం డబ్బులు అన్నీ ఆన్ లైన్ గేముల్లో పోగొట్టుకుంది. ఇది.. నవీన వల్ల తన భర్తకు తెలుస్తుందనేది కూడా కక్ష పెంచుకోవడానికి ఓ కారణంగా తెలుస్తోంది. మొత్తంగా చెడు అలవాట్లకు బానిసగా మారి తన జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా.. చిన్నారి హితిక్ష జీవితాన్ని కూడా చిదిమేసింది మమత. కాబట్టి మమతను కఠినంగా శిక్షించాలని హితిక్ష కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరోవైపు హితిక్ష లేని లోటును ఎవరు తీరుస్తారని చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Exit mobile version