జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం జరిగింది. ఐదేళ్ల చిన్నారిని పిన్ని అయ్యే మహిళ దారుణంగా గొంతు కోసి చంపేసింది. కేవలం ఆ చిన్నారి తల్లిదండ్రులతో ఉన్న అసూయతోనే అఘాయిత్యానికి పాల్పడింది. అంతే కాదు బాలికను చంపేసి ఏం తెలియనట్లు డ్రామా అడిన కిలాడీని ఎట్టకేలకు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఆడుకునేందుకు ఇంటి నుంచి వెళ్లిన బాలిక..అదే కాలనీలోని మరొకరి ఇంటిలో శవమై తేలింది.. బాత్రూంలో రక్తపు మడుగులో శవమై కనిపించింది. జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది.
కోరుట్లలోని ఆదర్శనగర్‌లో నివాసముంటున్న ఆకుల రాములు-నవీన దంపతులకు కుమారుడు వేదాస్, కూతురు ఐదేళ్ల హితిక్ష ఉన్నారు. రాములు ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లగా నవీన అత్తామామలతోనే ఉంటోంది. సాయంత్రం కాలనీకి చెందిన పిల్లలతో హితిక్ష ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. దొంగ పోలీస్, పులి ఆట ఆడుకుంటూ అదృశ్యమైపోయింది బాలిక. ఇతరులకు కనిపించకుండా తప్పించుకొని తిరిగే ఆటను కాలనీలో అందరి పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా కనిపించకుండా పోయింది. కొంత సేపటి తరువాత ఇంటికి వచ్చి నానమ్మతో కాలం గడిపినట్లు సమాచారం. ఆ తరువాత సాయంత్రం 7.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ తరువాత కనిపించకుండా పోయింది. సుమారు గంటన్నర పాటు వెతికారు. చివరికి తమ కూతురు కనిపించడం లేదని రాత్రి 8.30 గంటల సమయంలో పోలీసులకు చెప్పారు.
స్థానికుల సాయంతో పోలీసులు వెతుకుతుండగా అదే కాలనీలోని కొడుపల్లి విజయ్ ఇంటి బాత్రూంలో హితిక్ష రక్తపు మరకలతో లభ్యమయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించి వెంటనే హుటాహుటిన బాలికను ఆస్పత్రికి తీసుకుని పోగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విజయ్ ఇంట్లో హితిక్ష రక్తపు మడుగులో పడి ఉండడంతో అతడే హత్య చేసి ఉంటాడని బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. విజయ్ భార్య దూరంగా ఉంటున్నట్లుగా సమాచారం. ఆ ఇంట్లో విజయ్‌తో పాటు అతని అన్న, తమ్ముని కుమారులు ఉన్నట్లుగా సమాచారం.
విజయ్ ఎక్కడున్నాడని ఆరా తీసిన పోలీసులు సెల్‌ఫోన్ ద్వారా అతనితో మాట్లాడితే వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉన్నట్లుగా చెప్పాడు. అతను.. నర్సంపేటలో ఉంటే బాలిక మృతదేహం అతని ఇంట్లోని బాత్‌రూంలోకి ఎలా వచ్చిందన్న సందేహాలు వచాయి. ఇదిలా ఉంటే బాలిక తల్లితో.. పిన్నికి కొన్ని రోజుల నుంచి తీవ్రస్థాయిలో మనస్పర్ధలు ఉన్నాయి. ఈ మనస్పర్ధలు నేపథ్యంలోనే బాలిక పిన్ని చంపి ఉంటుందని అనుమానించారు.
పిన్ని మమతను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించే సరికి అసలు విషయం బయటపడింది. ఆడుకోవడానికి వెళ్లిన బాలికను పక్కింటి బాత్‌రూమ్‌కు తీసుకువెళ్లి హత్య చేసినట్లుగా ఒప్పుకుంది. బాలిక తల్లి దండ్రుల సంపాదపై ఉన్న అసూయతోనే చంపేసినట్లు వెల్లడించింది. అంతే కాదు గతంలో ఆన్‌లైన్‌లో బెట్టింగ్ ఆడిన మమత.. లక్షల రూపాయలు పోగొట్టుకుంది. ఓ వైపు డబ్బులు లేకపోవడం.. బాలిక తల్లి తనను చిన్నచూపు చూడడంతో కక్ష పెంచుకున్నట్లు వెల్లడైంది.
ఇక మమత పిన్ని మామూలు మహిళ కాదు.. అంతకు ముందు బాలికను అతి కిరాతకంగా హత్య చేసి.. మళ్లీ కుటుంబ సభ్యుల అందరితో కలిసి బాలికను వెతుకున్నట్లు డ్రామా ఆడింది. చిన్నారి మృతదేహం దొరికిన తర్వాత కూడా తన డ్రామా ఆపలేదు. అందరితో కలిసి చిన్నారి కోసం ఎంతో వేదన పడుతున్నట్లుగా ఏడ్చింది. అప్పటి వరకు ఏడ్చిన ఆమెను.. పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అంతా షాక్ అయ్యారు.
పెద్దవాళ్ల ఆర్ధిక సంబంధాలు.. కక్షలకు అభం శుభం తెలియని చిన్నారి హితిక్ష బలైంది.
