కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జీవిత ఆధారంగా రాసిన ఆత్మకథ ‘బీలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకాన్ని తెలుగులో సినిమాగా తెరకెక్కిస్తామని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందిరా గాంధీ కోడలిగా, రాజీవ్ గాంధీ భార్యగా, రాహుల్, ప్రియాంకలకు తల్లిగా ఆమె సాగించిన జీవిత ప్రయాణాన్ని, ఎదుర్కొన్న సవాళ్లను ఈ సినిమా ద్వారా ప్రజలకు చూపిస్తామని తెలిపారు.
సోనియా గాంధీది అత్యంత విజయవంతమైన, త్యాగపూరితమైన రాజకీయ జీవితమని జగ్గారెడ్డి కొనియాడారు. ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆమె పదవిపై వ్యామోహం చూపలేదని, భర్త రాజీవ్ గాంధీ మరణం తర్వాత పి.వి. నరసింహారావును, ఆ తర్వాత యుపిఎ హయాంలో డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా ఎంపిక చేసిన ఘనత ఆమెకే దక్కుతుందని గుర్తుచేశారు.
ఈ సినిమా నిర్మాణానికి కావాల్సిన నిధులను సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే స్వచ్ఛందంగా సమకూరుస్తారని, వారే ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తారని చెప్పారు. సినిమా నిర్మాణ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ ప్రతిష్టాత్మక చిత్ర షూటింగ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా వైభవంగా ప్రారంభిస్తామని జగ్గారెడ్డి వెల్లడించారు.

