NTV Telugu Site icon

IVPL 2024: క్రిస్‌ గేల్‌ 10 సిక్సర్లు బాదినా.. తెలంగాణకు తప్పని ఓటమి!

Chris Gayle

Chris Gayle

ఇండియన్‌ వెటరన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐవీపీఎల్) 2024లో తెలంగాణ టైగర్స్‌ మరో ఓటమిని ఎదుర్కొంది. వీవీఐపీ ఉత్తర్‌ప్రదేశ్‌తో సోమవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ మాజీ ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్‌ గేల్‌ సునామీ ఇన్నింగ్స్‌ ఆడాడు. 46 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లతో 94 పరుగులు చేశాడు. అయితే గేల్‌ విధ్వంకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయినప్పటికీ.. తెలంగాణ విజయం సాధించలేకపోయింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఉత్తర్‌ప్రదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. పవన్‌ నేగి (56 బంతుల్లో 139; 16 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీ చేయగా.. అన్షుల్‌ కపూర్‌ (45 బంతుల్లో 71; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. చివరలో కెప్టెన్‌ సురేశ్‌ రైనా (13 బంతుల్లో 27; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తెలంగాణ నిర్ణీత ఓవర్లలో 224 పరుగులు మాత్రమే చేసింది. క్రిస్‌ గేల్‌ ఔటైన తర్వాత శశకాంత్‌ రెడ్డి (39), కమలేశ్‌ (46 నాటౌట్‌) తెలంగాణను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. చివరకు తెలంగాణ 46 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Also Read: PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లో 16వ విడత పీఎం కిసాన్ డబ్బులు

ఐవీపీఎల్ 2024లో తెలంగాణ టైగర్స్‌ మూడు మ్యాచ్‌లు ఆడి ఒక మ్యాచ్ గెలిచింది. ముంబైపై ఓడిన తెలంగాణ.. రాజస్థాన్‌పై గెలిచింది. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌పై ఓడిపోయింది. ఫిబ్రవరి 23న మొదలైన ఈ లీగ్‌లో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. వీవీఐపీ ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, తెలంగాణ టైగ‌ర్స్‌, రాజ‌స్థాన్ లెజెండ్స్‌, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛ‌త్తీస్‌గ‌ఢ్ వారియ‌ర్స్‌, ముంబై ఛాంపియ‌న్స్ జట్లు ఆడుతున్నాయి.