NTV Telugu Site icon

Telengana Tigers: తెలంగాణ కెప్టెన్‌గా ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్!

Chris Gayle named Telangana Tigers Captain in IVPL 2024: వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మరోసారి బ్యాట్ పట్టేందుకు సిద్దమయ్యాడు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (ఐవీపీఎల్)లో గేల్ ఆడనున్నాడు. ఐవీపీఎల్ మొదటి ఎడిషన్‌లో తెలంగాణ టైగర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని గేల్ స్వయంగా చెప్పాడు. వెటరన్ ప్రీమియర్ లీగ్‌తో మీ ముందుకు రాబోతున్నా, ఐవీపీఎల్ కోసం అందరూ సిద్దంగా ఉండండి అని యూనివర్సల్ బాస్ పేర్కొన్నాడు.

‘నాపై నాకున్న నమ్మకం, ప్రేక్షకుల శబ్దాలు నన్ను క్రికెట్ ఆడేలా చేస్తున్నాయి. వెటరన్ ప్రీమియర్ లీగ్ ద్వారా మీ యూనివర్సల్ బాస్ మైదానంలోకి అడుగుపెడుతున్నాడు. ఓల్డ్ ఈజ్ గోల్డ్.. ఐవీపీఎల్ కోసం సిద్ధంగా ఉండండి’ అని క్రిస్ గేల్ పేర్కొన్నాడు. బోర్డ్ ఫర్ వెటరెన్ క్రికెట్ ఇన్ ఇండియా (బీవీసీఐ) ఆధ్వర్యంలో ఐవీపీఎల్ టోర్నీ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 వరకు జరగనుంది. డెహ్రాడూన్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐవీపీఎల్ ఆరంభ ఎడిషన్ జరగనుంది.

తెలంగాణ టైగర్స్ జట్టులో క్రిస్ గేల్‌తో పాటు వెస్టిండీస్ మాజీ బ్యాటర్ రికార్డో పావెల్‌ భాగం అయ్యాడు. భారత మాజీ క్రికెటర్లు సుదీప్ త్యాగి, మన్‌ప్రీత్ గోని కూడా టైగర్స్ జట్టులో సభ్యులు. ఐవీపీఎల్ టోర్నీలో వీరేందర్ సెహ్వాగ్, మునాఫ్ పటేల్, సురేష్ రైనా, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్, యూసుఫ్ పఠాన్, హెర్షెల్ గిబ్స్ లాంటి ఎందరో మాజీలు ఆడనున్నారు. వీవీఐపీ ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ వారియర్స్, తెలంగాణ టైగర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు ఐవీపీఎల్లో ఆడనున్నాయి.

Also Read: Virat Kohli: టీమిండియాకు బ్యాడ్‌న్యూస్.. మిగతా 3 టెస్టుల నుంచి విరాట్ కోహ్లీ ఔట్!
ప్రతీ జట్టులో నాలుగు నుంచి ఐదుగురు వరల్డ్ బెస్ట్ ప్లేయర్లు ఆడనున్నారు. డెహ్రాడూన్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్‌ల కోసం టికెట్‌లు త్వరలో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. మ్యాచ్‌లు యూరోస్పోర్ట్ ఛానెల్, డీడీ స్పోర్ట్స్ మరియు ఫ్యాన్‌కోడ్‌లో భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.