Income Tax Return 2026: మరో రెండు రోజులే గడువు.. ఆలస్యమైతే రూ.5,000 వరకు జరిమానా.. ఇతర ఇబ్బందులు తప్పవు..!

  • ITR ఫైలింగ్‌కు మరో రెండు రోజులే..
  • ఆలస్యమైతే రూ.5,000 వరకు జరిమానా..
  • జూలై 31లోగా ITR దాఖలు చేయండి..
Itr Filing Deadline Alert

Itr Filing Deadline Alert

Income Tax Return 2026: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కీలక హెచ్చరిక. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసేందుకు గడువు ముగియనుంది. ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించిన ప్రకారం జూలై 31 చివరి తేదీ. ఇప్పటికే కోట్లాది మంది తమ ఐటీఆర్‌ను దాఖలు చేసినప్పటికీ, ఇంకా పూర్తి చేయని వారు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. గడువు పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేస్తూ, చివరి నిమిషం వరకు వేచి ఉండవద్దని ఆదాయపు పన్ను శాఖ సోషల్ మీడియా వేదిక X ద్వారా కూడా నిరంతరం అవగాహన కల్పిస్తోంది.

గడువు తేదీ తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234F ప్రకారం, వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించి ఉన్న పన్ను చెల్లింపుదారులు ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేస్తే రూ.5,000 వరకు జరిమానా విధించబడుతుంది. వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు.. జరిమానాతో పాటు ఇతర ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. పన్ను బకాయిలు ఉంటే సెక్షన్ 234A ప్రకారం బకాయి మొత్తంపై నెలకు 1 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఆలస్యంగా దాఖలు చేసిన రిటర్న్‌ల ప్రాసెసింగ్ కూడా ఆలస్యం కావడంతో, రీఫండ్ కోసం ఎదురుచూసే వారికి డబ్బు అందడంలో జాప్యం ఏర్పడుతుంది.

అంతేకాదు, ఐటీఆర్‌లో ఆదాయాన్ని దాచిపెట్టడం లేదా తప్పుడు సమాచారం ఇవ్వడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేయడం లేదా పదేపదే నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నేర తీవ్రతను బట్టి మూడు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఇంకా ఐటీఆర్ దాఖలు చేయని పన్ను చెల్లింపుదారులు చివరి తేదీ కోసం వేచి ఉండకుండా వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేసి జరిమానాలు, వడ్డీలు, చట్టపరమైన సమస్యలను నివారించాలని ఆదాయపు పన్ను శాఖ సూచిస్తోంది.