NTV Telugu Site icon

IT Raids on Malla Reddy Assets: రెండో రోజు పూర్తైన మంత్రి మల్లారెడ్డిపై ఐటీ విచారణ

It Raids

It Raids

IT Raids on Malla Reddy Assets: మంత్రి మల్లారెడ్డిపై సోదాల కేసులో ఐటీశాఖ విచారణ రెండో రోజు ముగిసింది. మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్​రెడ్డి రేపు మరోసారి విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఐటీ అధికారులు ఇద్దరికీ నమూనా పత్రాలు ఇచ్చారు. నిర్దేశించిన సమాచారాన్ని సమర్పించాలంటూ అదాయపు పన్ను శాఖ అధికారులు సూచించారు. ఇవాళ ఐటీ అధికారుల ఎదుట తొమ్మిది మంది హాజరయ్యారు. మల్లారెడ్డి ఆడిటర్‌ సీతారామయ్య సహా కళాశాలకు చెందిన సిబ్బందిని అధికారులు నాలుగు గంటల పాటు విచారించారు. మల్లారెడ్డి విద్యాసంస్థల అకౌంటెంట్లను ఐటీ అధికారులు ప్రశ్నించారు. సోదాల్లో భాగంగా స్వాధీనం చేసుకున్న దస్త్రాలు, నగదు, హార్డ్ డిస్క్‌లకు సంబంధించిన విషయాలపై ఈ రోజు హాజరైన వారిని ప్రశ్నించారు. విద్యా సంస్థలకు చెందిన ఆదాయ వ్యయాలతో పాటు పన్ను చెల్లింపునకు సంబంధించిన వివరాలను ఐటీ అధికారులు అడిగి తెలుసుకున్నారు.

Read Also: Minister Harish Rao : ఆ విషయంలో వెనుకబడ్డ డబుల్ ఇంజిన్ రాష్ట్రాలు.. మంత్రి ప్రకటన

మంత్రి మల్లారెడ్డికి చెందిన రెండు మెడికల్ కాలేజీల ప్రిన్సిపళ్లను ఐటీ అధికారులు ప్రశ్నించారు. మేనేజ్ మెంట్ కోటా సీట్ల గురించి ఆరా తీశారు. ఒక్కో సీటు కోసం ఎంత డబ్బు తీసుకున్నారనే విషయాలను అడిగారు. వీళ్లను ప్రశ్నించి సమాచారం సేకరించిన ఐటీ అధికారులు… దీని ఆధారంగా మరికొంత మందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మొదటి రోజు మల్లారెడ్డి కుటుంబ సభ్యులతోపాటు… ఆయన విద్యాసంస్థల సిబ్బందిని అధికారులు విచారించారు. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి… వియ్యంకుడు మర్రి లక్ష్మారెడ్డి, కుమారుడు భద్రారెడ్డి, మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డిని ప్రశ్నించారు. లక్ష్మారెడ్డి వెంటనే వెళ్లిపోగా మిగిలిన వారిని 6 గంటలపాటు విచారించారు. వీరితో పాటు మల్లారెడ్డి బంధువైన నర్సింహారెడ్డి, అతని కుమారుడు త్రిశూల్ రెడ్డిలను సైతం ప్రశ్నించారు.