IT company turned the board in Hi-Tech City: నిరుద్యోగులు మరోసారి మోసపోయారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ట్రైనింగ్ సహా ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగుల నుంచి కోట్లు గుంజిన సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వాహకులు చేతులెత్తేశారు. దాంతో ఉద్యోగులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన బిజినేపల్లి ప్రేమ్ ప్రకాష్ (44) హైదరాబాద్ నగరానికి వలస వచ్చాడు. సనత్ నగర్‌లో నివాసం ఉంటూ.. స్నేహితుడు లిఖిత్‌తో కలసి 2022లో కొండాపూర్ వెస్ట్రన్ పెరల్ భవనంలో ‘సంటూ సూ ఇన్నోవేషన్స్’ పేరిట ఓ ఐటీ కంపెనీ ప్రారంభించాడు. తమ కంపెనీలో ట్రైనింగ్ అనంతరం ఉద్యోగం ఇస్తామని చెప్పి.. ఒక్కో నిరుద్యోగి వద్ద రూ. లక్ష నుంచి లక్షన్నర వసూలు చేశారు. ప్రకాష్, లిఖిత్‌లు డబ్బు కట్టి కంపెనీలో చేరిన వారికి రెండు నెలలు జీతాలు సరిగానే ఇచ్చారు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది.
Also Read: IND vs NEP: నేడు నేపాల్‌తో భారత్ కీలక మ్యాచ్.. సూపర్-4 లక్ష్యంగా బరిలోకి రోహిత్ సేన! బుమ్రా దూరం
శాలరీ ఇవ్వకుండా ఇదిగో అదిగో అంటూ ప్రకాష్, లిఖిత్‌లు కాలం గడుపుతున్నారు. ఇద్దరి నుంచి సరైన స్పందన లేకపోవడంతో సంటూ సూ ఇన్నోవేషన్స్ ఉద్యోగులు ఆదివారం మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ప్రకాష్, లిఖిత్‌లను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇద్దరు కలిసి దాదాపు రూ. 3 కోట్లు నిరుద్యోగుల నుంచి వసూలు చేశారని పోలీసులు తెలిపారు.