Site icon NTV Telugu

GSLV MK-3 : ఇస్రో ఖాతాలో మరో విజయం.. జీఎస్ఎల్వీ మార్క్ 3 ప్రయోగం సక్సెస్

Gslv Mark Iii

Gslv Mark Iii

GSLV MK-3 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఖాతాలో మరో విజయం నమోదైంది. అత్యంత బరువైన జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ను విజయవంతంగా నింగిలోకి పంపింది. ఈ ప్రయోగంలో 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి చేర్చింది. నెల్లూరు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి అక్టోబర్ 23వ తేదీ అర్ధరాత్రి 12:07 గంటలకు జీఎస్ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రో రాకెట్ జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రైవేట్ కమ్యూనికేషన్ సంస్థ వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది.

Read Also: Apple Watch: చిన్నారి ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్.. ఎలాగో తెలుసా?

ఇస్రో చరిత్రలో జీఎస్ఎల్వీ రాకెట్ మొదటి సారిగా ఆరు టన్నుల పేలోడ్‌ను మోసుకెళ్లింది. ఇది తీసుకెళ్లిన 36 శాటిలైట్లు పూర్తిగా విదేశాలకు చెందినవే. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఎస్ఐఎల్) అనే సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వన్‌వెబ్‌కు చెందిన 36 శాటిలైట్లను లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ)లో ప్రవేశపెట్టింది. మొత్తం 9 బ్యాచ్‌లలో 36 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరాయి. ఒక్కో ఉపగ్రహం 142 కిలోల బరువు ఉంటుంది.

ఈ ఉపగ్రహాలన్నీ యూకేకి చెందినవి. వాటిని కక్ష్యలోకి వెళ్లిన తర్వాత యూకే గ్రౌండ్ స్టేషన్ నుంచి నియంత్రిస్తారు. ఇక అమెరికా, ఫ్రాన్స్, యూకే కు చెందిన 14మంది సైంటిస్టులు కూడా ఈ ప్రయోగాన్ని వీక్షించారు. జీఎస్ఎల్వీ – మార్క్ 3 రాకెట్‌లో మూడు దశలు ఉన్నాయి. మొదటి దశలో 200 టన్నుల ఘన ఇంధనం, రెండో దశలో 110 టన్నుల ద్రవ ఇంధనం, మూడో దశలో 25 టన్నుల అతిశీతల క్రయోజనిక్ ఇంధనాన్ని వాడారు. ఈ ప్రయోగానికి మొత్తం రూ. 160 కోట్లు ఖర్చు అయ్యింది. రాకెట్ ప్రయోగం మొత్తం పూర్తి కావడానికి 19 నిమిషాల 7 సెకెన్ల వ్యవధి పట్టింది. ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధాని నరేంద్ర మోడీ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

Read Also: Allu Sneha Arjun: అల్లు అర్జున్ భార్యకు ఆ హీరోయిన్ అంటే ఇష్టం ఉండదట

వన్‌వెబ్ అనే సంస్థ మొత్తం 588 శాటిలైట్లను ప్రయోగించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నది. లో ఎర్త్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టి ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు ఇవ్వాలనేది ఆ సంస్థ లక్ష్యం. మొత్తం 12 రింగ్స్ లో ఒక్కో దాంట్లో 49 శాటిలైట్లను ఉంచబోతోంది. ఇవన్నీ భూమి నుంచి 1,200 కిలోమీటర్ల పైన తిరుగుతూ ఉంటాయి. ఒక్కో శాటిలైట్ భూమిని చుట్టడానికి 109 నిమిషాలు పడుతుంది. జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం సందర్భంగా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ శనివారం సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈవో ఆళ్ల శ్రీనివాసులరెడ్డి ఆయనకు అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు.

Exit mobile version