Site icon NTV Telugu

ISRO: PSLV-C54 రాకెట్ ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్.. 26న ముహూర్తం

Isro1

Isro1

వరుస రాకెట్ ప్రయోగాలతో బిజీగా వుంది శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగకేంద్రం. ఈనెల 26 న తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి PSLV-C54 రాకెట్ ప్రయోగానికి శాస్త్ర వేత్తలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రయోగం పై మిషన్ సన్నద్ధత సమావేశం జరిగిది. శుక్రవారం ఉదయం 10గంటల 26 నిముషాలకు కౌంట్ డౌన్ ప్రారంభం అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 25 గంటల 30 నిముషాల అనంతరం 26 వ తేదీ ఉదయం 11 గంటల 56 నిముషాలకు శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్ ప్రయోగం జరగనుంది.

ఈ రాకెట్ ప్రయోగం ద్వారా EOS-06 (ocean sat 2) అనే ప్రధాన ఉపగ్రహం తోపాటు విదేశాలకు చెందిన మరో 8 చిన్న తరహా ఉపగ్రహాలను నింగిలోనికి పంపనుంది ఇస్రో. భారత్, భూటాన్ సంయుక్తంగా డెవలప్​ చేసిన ఎనిమిది నానోశాటిలైట్​లను ఇస్రో నింగిలోకి పంపనుంది. పీఎస్​ఎల్​వీ లాంచ్ వెహికల్ ద్వారా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ ఏడాది అయిదో ప్రయోగాన్ని చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉపగ్రహాన్ని సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లోకి ప్రయోగించనున్నారు. 2019లో ప్రధాని నరేంద్ర మోదీ థింపూ పర్యటన తర్వాత అంతరిక్ష ప్రయోగం సంయుక్తంగా చేపడుతుందని ప్రకటించారు.

భారతదేశం సెప్టెంబర్ 2021లో భూటాన్‌తో దీనికి సంబంధించిన ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భూటాన్ 2019లో తన మొదటి ఉపగ్రహం భూటాన్-1ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఇది విద్య ఆధారిత క్యూబ్‌శాట్. అదే సమయంలో ఓషన్‌శాట్ శ్రేణి ఉపగ్రహాలు భూమి పరిశీలన, నీటి వనరుల పర్యవేక్షణ కోసం ఉపయోగిస్తున్నారు. 30 సెంటీమీటర్ల క్యూబిక్ ఉపగ్రహాన్ని భూటాన్ ఇంజనీర్లు ప్రత్యేకంగా తయారు చేశారు. ఇది భూటాన్​ మీదుగా ఎగురుతూ భూమి ఉపరితలం చిత్రాలను తీస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 15 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం భూటాన్ ఉపరితలాన్ని రోజుకు కనీసం రెండు మూడు సార్లు కవర్ చేస్తుందని అంటున్నారు.

Read Also: Bandi Sanjay : తనిఖీలు చేయాలా వద్దా..? దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉంది

గత వారం 550 కిలోల చిన్న రాకెట్ విక్రమ్ ఎస్ ని ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించారు. రోదసీ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి ఈ తొలిరాకెట్ ప్రయోగం చారిత్రక ఘట్టంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రైవేట్ రంగం నుంచి మరిన్ని ప్రయోగాలు జరగాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటివరకూ ఇస్రో ప్రయోగాలకు అనేక ప్రైవేట్ సంస్థలు ఇతోధిక సహకారం అందించాయి. స్కై రూట్ సంస్థలాంటివి ఈ రంగంలోకి మరింతగా రావాల్సిన అవసరం ఉంది.

Read Also: Jama Masjid: జామామసీద్‌లోకి మహిళల ప్రవేశంపై నిషేధం.. మహిళా కమిషన్ నోటీసులు

Exit mobile version