Site icon NTV Telugu

Somaliland Recognition: 30 ఏళ్లుగా గుర్తింపునకు నోచుకొని దేశం.. కానీ ఫస్ట్ టైం!

Somaliland Recognition

Somaliland Recognition

Somaliland Recognition: 30 ఏళ్లుగా ఒక దేశానికి గుర్తింపు లేదు.. అయితే దానికి సొంత ప్రభుత్వం, కరెన్సీ, పాస్‌పోర్ట్ ఉన్నప్పటికీ 30 ఏళ్లుగా గుర్తింపు లేదు. అయితే ఫస్ట్ టైం ఇజ్రాయెల్ దానిని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించింది. ఇంతకీ ఆ దేశం ఏంటో తెలుసా.. సోమాలిలాండ్‌. ఇటీవల ఇజ్రాయెల్ సోమాలిలాండ్‌ను ఆఫ్రికాలో ఒక స్వతంత్ర, సార్వభౌమాధికార దేశంగా గుర్తించడమే కాకుండా, దానితో దౌత్య సంబంధాలను ఏర్పరచుకునే ప్రణాళికలను ప్రకటించింది. దీనితో సోమాలిలాండ్‌ను గుర్తించిన మొదటి దేశంగా ఇజ్రాయెల్ గుర్తింపు పొందింది.

READ ALSO: AP News: మందు బాబులకు శుభవార్త.. అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు!

ఇజ్రాయెల్ అధికారికంగా సోమాలిలాండ్ రిపబ్లిక్‌ను గుర్తించిందని పేర్కొంటూ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ విషయాన్ని ధృవీకరించారు. సోమాలిలాండ్ ఉత్తర సోమాలియాలో, ఆఫ్రికా హార్న్‌లో ఉంది. సోమాలిలాండ్‌కు ఇంకా అంతర్జాతీయ గుర్తింపు లభించనప్పటికీ, ఇది చాలా కాలంగా ఒక దేశంగా పనిచేస్తోంది.

సోమాలియా నుంచి విడిపోయి..
కేంద్ర ప్రభుత్వం పతనం, సంవత్సరాల తరబడి జరిగిన తీవ్రమైన అంతర్యుద్ధం తర్వాత 1991లో సోమాలిలాండ్ సోమాలియా నుంచి విడిపోయింది. అప్పటి నుంచి, సోమాలిలాండ్ సొంతంగా ఎన్నికైన ప్రభుత్వం, పార్లమెంట్, పోలీసులు, కరెన్సీ, పాస్‌పోర్ట్ వ్యవస్థతో పనిచేస్తోంది. నిజానికి సోమాలియాలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఈ దేశంలో ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. గత సంవత్సరం సోమాలిలాండ్ అధ్యక్షుడిగా అబ్దిరహ్మాన్ మొహమ్మద్ అబ్దుల్లాహి పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి.. ఆయన దేశానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి విశేషంగా కృషి చేస్తున్నారు.

సోమాలిలాండ్ తన సొంత కరెన్సీ అయిన సోమాలిలాండ్ షిల్లింగ్‌ను కలిగి ఉంది. ప్రజల నుంచి పన్నులు కూడా వసూలు చేస్తుంది, ప్రజా ఆర్థిక నిర్వహణను సైతం సక్రమంగా నిర్వహిస్తుంది. అలాగే ఓడరేవుల ద్వారా, ముఖ్యంగా బెర్బెరా ఓడరేవు ద్వారా వాణిజ్యాన్ని నియంత్రిస్తుంది. అలాగే ఈ దేశం పాస్‌పోర్ట్‌లు, జాతీయ గుర్తింపు కార్డులను జారీ చేస్తుంది, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి, నిర్వహిస్తుంది, ప్రజా ఆరోగ్య సంరక్షణ, ఇతర ప్రజా సేవలను స్వతంత్రంగా నిర్వహిస్తుంది.

అంతర్జాతీయ గుర్తింపు ఎందుకు రాలేదంటే..
దేశంలో బలమైన ప్రభుత్వం, బాగా పనిచేసే సంస్థలు ఉన్నప్పటికీ సోమాలిలాండ్‌కు గత 30 సంవత్సరాలకు పైగా అంతర్జాతీయ గుర్తింపు లేదు. చాలా దేశాలు, అంతర్జాతీయ సంస్థలు స్వాతంత్ర్యం సమయంలో ఏర్పడిన సరిహద్దులను పరస్పర అంగీకారం లేకుండా మార్చకూడదనే సూత్రానికి కట్టుబడి ఉన్నాయి. విడిపోయిన ప్రాంతాలను గుర్తించడం వలన మిగిలిన వేర్పాటువాద ఉద్యమాలను ప్రోత్సహించినట్లు అవుతుందన్న కారణంగా ఇప్పటికి చాలా దేశాలు సోమాలిలాండ్‌ను ఒక ప్రత్యేక దేశంగా గుర్తించలేదు. సోమాలియా ఇప్పటికి కూడా సోమాలిలాండ్‌ను తన భూభాగంలో భాగమని పేర్కొంటూ, ఆ దేశ స్వాతంత్ర్యాన్ని నిరంతరం తిరస్కరిస్తుంది. ఐక్యరాజ్యసమితి, ఆఫ్రికన్ యూనియన్ (AU), అలాగే చాలా దేశాలు కూడా సోమాలిలాండ్‌కు కాకుండా సోమాలియాకు మద్దతు ఇచ్చి, సోమాలిలాండ్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించడానికి నిరాకరించాయి.

తాజాగా ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయంపై అనేక దేశాలు, ప్రాంతీయ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇజ్రాయెల్ సోమాలిలాండ్‌కు ఇచ్చిన ప్రత్యేక గుర్తింపును సోమాలియా దురాక్రమణగా, సార్వభౌమాధికార ఉల్లంఘనగా అభివర్ణించింది. వెంటనే ఇజ్రాయెల్ ఈ గుర్తింపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. లేదంటే ఆ గుర్తింపును సవాలు చేయడానికి దౌత్య ప్రయత్నాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేసింది. ఈ విషయంలో ఆఫ్రికన్ యూనియన్ (AU) కూడా సోమాలియాకు మద్దతు తెలిపింది. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా నుంచి 20 కి పైగా దేశాలు, అలాగే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో, ఈ గుర్తింపును హార్న్ ఆఫ్ ఆఫ్రికా, మొత్తం ఈ ప్రాంతం భద్రతకు ముప్పు కలిగించే ప్రమాదకరమైన ఉదాహరణగా అభివర్ణించారు.

అలాగే సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఖతార్, కువైట్, ఇరాక్, జోర్డాన్ వంటి అనేక అరబ్ దేశాలు ఈ చర్యను అంతర్జాతీయ చట్ట ఉల్లంఘనగా అభివర్ణించాయి. ఇంటర్-గవర్నమెంటల్ అథారిటీ ఆన్ డెవలప్‌మెంట్ (IGAD) వంటి ప్రాంతీయ సంస్థలు కూడా ఈ చర్యను ఖండించాయి. ఇది అంతర్జాతీయ చట్టం, ప్రాంతీయ సహకారం యొక్క ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నాయి.

READ ALSO: Sarvam Maya: మలయాళ బ్లాక్ బస్టర్లో అదరగొట్టిన స్టార్ ప్రొడ్యూసర్ కూతురు

Exit mobile version