ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయినా కూడా లెబనాన్‌పై కాల్పులు ఆగలేదు. తాజాగా ఆదివారం మరోసారి లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలతో సహా 14 మంది మరణించారని.. మరో 17 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. అంతకముందు పలు గ్రామాలకు ఐడీఎఫ్ దళాలు హెచ్చరికలు జారీ చేసింది. తక్షణమే ఇళ్లులు ఖాళీ చేసి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని.. లేదంటే ప్రాణాలకు ప్రమాదం అని సూచించింది.
హిజ్బుల్లా ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లుగా ఐడీఎఫ్ ప్రతినిధి తెలిపాడు. లెబనాన్‌లో హిజ్బుల్లా డ్రోన్ దాడిలో 19 ఏళ్ల ఐడీఎఫ్ సైనికుడు చనిపోయాడని.. మరో ఆరుగురు గాయపడ్డారని పేర్కొన్నాడు. ఇజ్రాయెల్ వైపు హిజ్బుల్లా మూడు డ్రోన్లు ప్రయోగించిందని.. వాటిని సరిహద్దు దాటక ముందే అడ్డుకున్నట్లు చెప్పాడు. ఆత్మ రక్షణ కోసమే దాడులు చేస్తున్నట్లుగా ఇజ్రాయెల్ తెలిపింది.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. లెబనాన్‌లో ఐడీఎఫ్ చురుకుగా పని చేస్తోందని.. బలప్రయోగంతో వ్యవహరిస్తోందన్నారు. హిజ్బులా చర్యలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఏప్రిల్ 16న ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య వారం పాటు కాల్పుల విరమణ జరిగింది. తిరిగి గురువారం ఈ ఒప్పందాన్ని మూడు వారాల పాటు పొడిగింపబడింది. అయితే హిజ్బుల్లా కవ్వింపు చర్యలకు పాల్పడడంతో ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తోంది. తాజా దాడుల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
