ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ వరుస దాడులతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని పాలస్తీనా పౌరులు భయంతో గడుపుతున్నారు. తాజాగా గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనియన్లు తలదాచుకుంటున్న నాలుగు పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడిలో 69 మంది పౌరులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి. గాయపడినవారిలో జర్నలిస్టులు, పాలస్తీనా సివిల్ డిఫెన్స్‌కు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు.
మరోవైపు సిరియాలో సోమవారం తెల్లవారుజామున భూమి ఒక్కసారిగా కంపించింది. అయితే అది భూకంపం కాదు, టార్టస్ నగరంపై ఇజ్రాయెల్ చేసిన దాడి తీవ్రత ప్రకంపనలు. భారీ అగ్నిగోళం, ధూళి మేఘం కొన్ని కిలో మీటర్ల మేరకు కనిపించాయి. పలుమార్లు అక్కడి నుంచే పేలుడు శబ్ధాలు వినిపించాయి. ఒకానొక సమయంలో ఇక్కడ భూమి కంపించిపోయి.. రిక్టర్ స్కేల్‌పై 3.0గా ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం కంటే రెండు రెట్ల వేగంతో ప్రకంపనలు వచ్చినట్లు రిసెర్చర్ రిచర్డ్ కోర్డారో ఓ పాకటనలో తెలిపారు. 2012 నుంచి సిరియాపై ఇజ్రాయెల్ చేసిన అతిపెద్ద దాడి ఇదే అని నిపుణులు అంటున్నారు.