Is Ishan Kishan Set to Be Released from BCCI Central Contract: గతేడాది డిసెంబర్ నుంచి టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇషాన్.. సిరీస్ ఆరంభానికి ముందే స్వదేశానికి వచ్చాడు. అప్పటినుంచి బీసీసీఐ, భారత జట్టు మేనెజ్‌మెంట్‌తో టచ్‌లో లేడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఇషాన్ అందుబాటులో ఉంటాడనుకున్నా.. అది జరగలేదు. చివరి మూడు టెస్టులకు ఇటీవల బీసీసీఐ సెలెక్టర్లు భారత జట్టును ప్రకటించినా.. అతడిది చోటు దక్కలేదు. కేఎస్ భరత్, ధృవ్ జోరెల్‌లు కీపర్‌గా కొనసాగారు.
రెండో టెస్టు అనంతరం భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు ఎంపిక కావాలంటే ఇషాన్ కిషన్ కచ్చితంగా రంజీ ట్రోఫీ 2024లో ఆడాల్సిందే అని స్పష్టం చేశాడు. అయితే కిషన్ మాత్రం రాహుల్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోకుండా.. బరోడాలో ఐపీఎల్ 2024 కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. జార్ఖండ్ తరఫున రంజీ ట్రోఫీ 2024లో బరిలో దిగే అవకాశం ఉన్నా.. కిషన్ ఐపీఎల్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ విషయంపై బీసీసీఐ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ నివేదిక ప్రకారం.. ఇషాన్‌పై చర్యలకు బీసీసీఐ సిద్దమైనట్లు తెలుస్తోంది.
2024-25 ఏడాది గాను బీసీసీఐ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను త్వరలో ప్రకటించనుంది. వచ్చే ఏడాదికి ఇషాన్ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గ్రేడ్ సిలో ఉన్న అతడి కాంట్రాక్ట్‌ను పునరుద్దరించే ఆలోచనలో బీసీసీఐ లేదట. 2022-23లో తొలిసారి ఇషాన్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. ఏడాదికి కోటి రూపాయలు వార్షిక వేతనాన్ని అతడు అందుకుంటున్నాడు. ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ తరఫున సత్తాచాటిన ఇషాన్.. జాతీయ జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. భారత్ తరఫున ఇప్పటివరకు ఇషాన్ 2 టెస్టులు, 27 వన్డేలు, 32 టీ20లు ఆడాడు.