NTV Telugu Site icon

Sadhguru: సద్గురు జగ్గీవాసుదేవ్‌కు బ్రెయిన్‌ సర్జరీ

Sadhguru

Sadhguru

ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్‌కు బ్రెయిన్‌ సర్జరీ జరిగింది. హఠాహత్తుగా ఆయనకు ఆరోగ్యం సీరియస్‌ కావడంతో హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆయనకు స్కానింగ్‌లు నిర్వహించగా.. డాక్టర్లు బ్రెయిన్ సర్జరీ చేశారు.

మెదడులో బ్లీడింగ్‌ కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 17న ఆస్పత్రిలో చేరిన ఆయనకు అదేరోజు సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారని ఈషా ఫౌండేషన్‌ తెలిపింది. అలాగే ఆయనకు వెంటిలేటర్ కూడా తొలగించారు. అత్యంత వేగంగా కోలుకుంటున్నారని డాక్టర్లు కూడా వెల్లడించారు.

గత కొద్ది రోజులుగా సద్గురు విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. వైద్యులు టెస్టులు చేయగా.. ఆయనకు మెదడులో భారీ రక్తస్రావం, మరియు వాపు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే బ్రెయిన్‌కు శస్త్ర చికిత్స నిర్వహించారు.

సద్గురు మెదడులో ప్రాణాంతక పరిస్థితి ఉందని అపోలో సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినిత్ సూరి తెలిపారు. CT స్కాన్ తర్వాత మెదడులో తీవ్రమైన వాపును గుర్తించినట్లు వెల్లడించారు. రోజువారీ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో సద్గురు నొప్పిని పట్టించుకోలేదని తెలుస్తోంది. నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతోనే సద్గురు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఆస్పత్రిలో చేరిన కొన్ని గంటల్లోనే సద్గురు బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నారు.

ప్రస్తుతం సద్గురు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది. అన్ని అవయవాలు పని చేస్తున్నాయని వైద్యులు తెలిపారు. ఊహించిన దాని కంటే ఎక్కువగా సద్గురు కోలుకుంటున్నారని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం సద్గురు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో సమావేశాలు, సమ్మేళనానికి హాజరయ్యేందుకు సద్గురు వచ్చారు. హస్తినకు చేరుకున్నాక ఈ పరిస్థితులు తలెత్తాయి.

Show comments