AR Rahman: ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ రోజు బాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన మ్యూజిక్ కంపోజర్లలో ఒకరిగా నిలిచారు. హిందీ సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకోవడానికి ఆయనకు దాదాపు ఏడేళ్లు పట్టింది. ఈ విషయంపై ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెహమాన్ మాట్లాడుతూ.. మొదట్లో బాలీవుడ్‌లో తను బయటి వాడిలా భావించారని చెప్పారు. ‘రోజా’, ‘బాంబే’, ‘దిల్ సే’ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసినప్పటికీ.. హిందీ చిత్రసీమలో భాగమన్న భావన కలగలేదన్నారు. అయితే 1999లో విడుదలైన సుభాష్ ఘై చిత్రం ‘తాల్’ తర్వాతే తన సంగీతం ఉత్తర భారతదేశం అంతటా వ్యాపించి, ప్రజల జీవితాల్లో భాగమైందని చెప్పారు. “తాల్ పాటలు ఇళ్ల వంటగదుల్లో కూడా వినిపించేవి. ఉత్తర భారతదేశం ప్రజల రక్తంలో ఆ సంగీతం కలిసిపోయింది” అని గుర్తు చేసుకున్నారు.
READ MORE: Maruti Suzuki బంపర్ ఆఫర్.. జనవరిలో ఈ కార్లపై రూ. 1.70 లక్షల వరకు భారీ తగ్గింపు.!
అంతేకాదు.. గత ఎనిమిదేళ్లుగా బాలీవుడ్‌లో తనకు తక్కువ అవకాశాలు రావడంపై రెహమాన్ స్పందించారు. భాష లేదా మతం కారణంగా ఆఫర్లు రావడం లేదని పరోక్షంగా తెలిపారు. అయితే తాను మాత్రం బాలీవుడ్‌లో ప్రత్యక్షంగా వివక్షను అనుభవించలేదని చెప్పారు. అయితే తనకు ఆఫర్‌లు రాకపోయినా.. సానుకూలంగా తీసుకుంటానని రెహమాన్ అన్నారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుందని చెప్పారు. తాను పనుల కోసం ఎవ్వరి వెంటా పడనని.. ఆఫర్లు తనను వెతుక్కుంటూ రావాలని.. అప్పుడే తనకు గౌరవం దక్కుతుందని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఏఆర్ రెహమాన్ బాలీవుడ్‌లో 1991లో మణిరత్నం దర్శకత్వం వహించిన ‘రోజా’తో అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘బాంబే’ (1995), ‘దిల్ సే’ (1998) వంటి చిత్రాల్లో సంగీతం అందించారు. అలాగే 1995లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రంగీలా’ వంటి విభిన్నమైన చిత్రానికి కూడా సంగీతం అందించారు. అయితే ‘తాల్’ తర్వాతే తాను నిజంగా హిందీ సినిమా పరిశ్రమలో భాగమయ్యాననే భావన కలిగిందని రెహమాన్ తెలిపారు.
