Site icon NTV Telugu

Irfan Pathan: అతడు అడిగితే నా ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తా.. ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Irfan Pathan

Irfan Pathan

Irfan Pathan emotional comments on Yusuf Pathan: మైదానంలో బంతితో విధ్వంసం సృష్టించి, ప్రత్యర్థులను బ్యాట్‌తో వణికించిన ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్. భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్ 2006లో కరాచీలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో మొదటి ఓవర్లోనే హ్యాట్రిక్‌ తీసి సంచలనంగా మారాడు. అద్భుతంగా స్వింగైన బంతులకు సల్మాన్‌ బట్‌, యూనస్‌ ఖాన్‌, మహ్మద్‌ యూసుఫ్‌ను ఔట్‌ అవ్వడం అభిమానులను విస్మయానికి గురిచేసింది. అప్పట్లో హ్యాట్రిక్‌ అంటే పెద్ద విషయం. అందులోనూ టెస్ట్ మ్యాచ్, మొదటి ఓవర్ అంటే మాములు విషయం కాదు. అందుకే క్రికెట్‌ అభిమానులు ఇప్పటికీ ఇర్ఫాన్ ప్రదర్శన గురించి మాట్లాడుకుంటారు. అయితే తాజాగా సోదరు యూసఫ్ పఠాన్‌తో తనకున్న అనుబంధాన్ని ఇర్ఫాన్ వెల్లడించాడు.

తాజాగా యూట్యూబ్ ఛానెల్‌ ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ పఠాన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా బాల్యంలో మీరు ఎప్పుడైనా గొడవ పడ్డారా? అని యాంకర్ అడగగా.. ఇర్ఫాన్ తన చిన్ననాటి జ్ఞాపకాన్ని వివరించాడు. ‘ఒకసారి మా ఏరియా మాండ్వి నగర్‌లో మా అన్నయ్య యూసఫ్ పఠాన్‌ ఓ వ్యక్తితో గొడవ పడ్డాడు. అన్నయ్య చిరిగిన బట్టలతో ఇంటికి వచ్చాడు. అది చూసి నేను ఆవేశంతో పరిగెత్తాను. ఇద్దరం కలిసి ఆ వ్యక్తిని రోడ్డు మీద చితకబాదాం. అప్పుడు మాకు 10-12 ఏళ్లు ఉంటాయి. అదృష్టవశాత్తూ ఆ అబ్బాయి తండ్రి మా నాన్న స్నేహితుడు. దాంతో మాపై పోలీస్ కేసు కాలేదు. మేము బతికి బయటపడ్డాము’ అని ఇర్ఫాన్ తెలిపాడు. గొడవ దేని గురించి అని యాంకర్ అడగగా… ‘ఇక్కడ గొడవకు కారణం ముఖ్యం కాదు. మా అన్నయ్యకు గొడవ జరిగింది. ఏది ఒప్పు, ఏది తప్పు అనే అవసరం లేదు. అన్నయ్య రమ్మంటే వెళ్లాల్సిందే. కొన్నిసార్లు కారణం చెప్పాల్సిన అవసరం ఉండదు’ అని బదులిచ్చాడు.

Also Read: Kohli-Rohit: వన్డేలకూ కోహ్లీ, రోహిత్ గుడ్‌బై చెప్పేశారా?.. అయోమయానికి గురైన అభిమానులు!

‘నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశాను. చాలా మంది స్నేహితులు నా జీవితంలోకి వచ్చి వెళ్లారు. ఓ వ్యక్తి మాత్రం ఎప్పుడూ నా పక్కనే ఉన్నాడు. అతడే నా సోదరుడు. యూసఫ్ నా సోదరుడు మాత్రమే కాదు.. నా ప్రాణం, జీవితం. యూసఫ్ కోసం నా ప్రాణాన్ని త్యాగం చేయగలను. అలాంటి పరిస్థితిని ఎప్పుడూ రాదని నాకు ఖచ్చితంగా తెలుసు. నాకు ఇది కావాలని అతనికి తెలిస్తే.. అన్నయ్య దానిని ఎప్పటికీ అడగడు. నేను 100 రూపాయలు సంపాదించినా.. అందులో 50 రూపాయలు అన్నయ్యవే. నాకు ఏమీ చెప్పకుండానే అన్నయ్య 100 రూపాయలు సంపాదిస్తే.. అందులో 50 రూపాయలు నావే. ఈ వ్యవస్థ మా ఇంట్లో ఉంది. దీనంతటికీ కారణం మా నాన్న’ అని ఇర్ఫాన్ పఠాన్ తన అనుబంధాన్ని తెలిపాడు.

Exit mobile version