Iran Embassy Shares Baahubali Video: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఓవైపు దాడులు, ప్రతిదాడులు.. మరోవైపు సోషల్ మీడియాలో వార్నింగ్‌ల పర్వం నడుస్తూనే ఉంది.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా.. తెలుగు సినిమాలకు సంబంధించిన వీడియో క్లిప్‌లను షేర్ చేసి మరీ కౌంటర్ ఎటాక్‌కు దిగుతోంది ఇరాన్.. జింబాబ్వేలోని ఇరాన్ కాన్సులేట్ ‘ఎక్స్’ వేదికగా ఈ మధ్య చేసిన పోస్టు వైరల్‌గా మారిపోయింది.. భగవంత్ కేసరి సినిమాలో హీరో నందమూరి బాలకృష్ణ.. విలన్లను మట్టుబెట్టిన వీడియో షేర్ చేశారు.. ఇక, ఇప్పుడు అమెరికా ఒత్తిడికి తలవంచబోమన్న సందేశాన్ని ఇరాన్ వినూత్నంగా వ్యక్తం చేసింది. ప్రభాస్ నటించిన తెలుగు బ్లాక్‌బస్టర్ ‘బాహుబలి: ది బిగినింగ్’లోని కీలక సన్నివేశాన్ని ఇరాన్ హైదరాబాద్ కాన్సులేట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాహుబలి కలకేయులపై తన సైన్యాన్ని నడిపించే సన్నివేశాన్ని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఐక్యరాజ్యసమితి ప్రసంగంతో పోల్చింది.
“బాహుబలి కలకేయుల ఎదుట నిలబడినట్లే.. మాతృభూమి కోసం మేము కూడా త్యాగం చేస్తున్నాం” అనే భావనతో ఇరాన్ కాన్సులేట్ ఈ వీడియోను పంచుకుంది. అమెరికా ఒత్తిడికి తాము ఎప్పటికీ తలవంచబోమని పెజెష్కియన్ యూఎన్‌లో చేసిన వ్యాఖ్యలకు ఈ వీడియోను ప్రతీకాత్మకంగా అనుసంధానించింది. సెప్టెంబర్ 23న న్యూయార్క్‌లో జరిగిన 81వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో మాసౌద్ పెజెష్కియాన్ ప్రసంగించారు. ఇరాన్‌పై ఆంక్షలు, బెదిరింపులు, ఒత్తిళ్లు పెంచినా తమ ప్రజల సంకల్పం మరింత బలపడుతుందని ఆయన అన్నారు. “తలవంచం.. మోకరిల్లం” అనే వైఖరిని స్పష్టం చేశారు. అదే సమయంలో ఇరాన్ చర్చలు, దౌత్యానికి సిద్ధంగా ఉందని, అయితే బలప్రయోగ భాషను అంగీకరించబోమని పేర్కొన్నారు.
ఓవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో పెజెష్కియన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై ఒత్తిడి, ఆంక్షలు తమ వైఖరిని మార్చలేవని ఆయన పేర్కొన్నారు. అలాగే అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంపై దాడులు చేశాయని ఆరోపిస్తూ, ఇరాన్ చేపట్టిన సైనిక ప్రతిస్పందనను ఆయన సమర్థించారు. వ్యూహాత్మకమైన హార్మూజ్ జలసంధి అంశాన్ని కూడా పెజెష్కియన్ ప్రస్తావించారు. ఇతర దేశాలు ఈ జలమార్గం ద్వారా ప్రయోజనం పొందుతూ, ఇరాన్‌కు మాత్రం దానిపై ప్రవేశాన్ని నిరాకరించడం సరికాదని ఆయన వాదించారు. ఇరాన్ అణు కార్యక్రమంపై మాట్లాడుతూ.. అణ్వస్త్రాలను కోరుకోవడం లేదని, అయితే శాంతియుత అణు సాంకేతికతపై పరిమితులను అంగీకరించబోమని స్పష్టం చేశారు.
ఇక, తాజాగా ఇరాన్ హైదరాబాద్ రాయబార కార్యాలయం సూపర్ డూపర్ హిట్ మూవీ, తెలుదోడి సత్తాను ప్రపంచానికే చాటిన ‘బాహుబలి’ వీడియోను ఉపయోగించడం ద్వారా భారతీయ సినీ సంస్కృతిలోని ప్రముఖ పాత్రను తన దేశ రాజకీయ సందేశంతో లింక్ చేసింది.. తెరపై బాహుబలి పోరాటం, త్యాగం, ప్రతిఘటనను ఇరాన్ తన ప్రస్తుత వైఖరికి ప్రతీకగా చూపించింది. మరోవైపు, ఒత్తిడిని అంగీకరించకుండా చర్చలు, దౌత్యానికి తాము సిద్ధంగా ఉన్నామని పెజెష్కియన్ చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందేశంలో హైలైట్ చేసింది.
Dr. Pezeshkian, President of I.R #Iran at UNGA: "Will never bow our head or bend the knee"
Like Baahubali standing against the Kalakeyas, we also shed our own blood in sacrifice for the homeland. pic.twitter.com/xc1S9H346Q
— Iran In Hyderabad (@IraninHyderabad) September 27, 2026

