Site icon NTV Telugu

Off The Record: కూటమి ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న ఐపీఎస్‌ సునీల్‌ కుమార్‌..

Ips Sunil Kumar

Ips Sunil Kumar

కూటమి ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న ఆ సీనియర్‌ ఐపీఎస్‌ ఉన్నట్టుండి ఎందుకు కొత్త పొలిటికల్‌ ఫార్ములాని తెర మీదికి తెచ్చారు? అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమా? లేక తెర వెనక వేరే రాజకీయ శక్తులుండి మాట్లాడిస్తున్నాయా? ఆయన పేల్చింది సీమ టపాకాయా? లేక పొలిటికల్‌ ఆర్డీఎక్సా? ఎవరా ఐపీఎస్‌? ఏంటా కొత్త ఫార్ములా?

Also Read:GOAT Teaser: నవ్వులు పంచేలా.. సుడిగాలి సుధీర్‌ GOAT టీజర్‌..

ఆంధ్రప్రదేశ్‌ పాలిటిక్స్‌లో అత్యంత కీలక పాత్ర పోషించే, జనాభాపరంగా అధిక సంఖ్యలో వుండే కాపు సామాజికవర్గం చాలా కాలంగా ముఖ్యమంత్రి పీఠం ఆశిస్తోంది. కానీ… రాజకీయాల్లో భావావేశాల కంటే నిర్ధిష్ట ప్రణాళిక ప్రధానం అన్న కీలక పాయింట్ దగ్గరే ఆ కోరిక తీరకుండా మిగిలిపోయింది. 2009లో ప్రజారాజ్యం వచ్చినప్పుడు చాలా ఆశలు పెట్టుకుంది కాపు సామాజికవర్గం. చిరంజీవి పార్టీ పెట్టిన కొత్తల్లో ఇంకేముంది మనం వచ్చేస్తున్నామని అనుకున్నా… ఫైనల్‌గా సాధ్యపడలేదు. ఆ తర్వాత జనసేన ఆవిర్భావం, దశాబ్దకాలపు ఆటుపోట్ల తర్వాత పార్టీ ఉనికి చాటుకోగలిగింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని సీట్లలో గెలిచి సత్తా చాటడమేగాక ఏపీ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది జనసేన. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ యాక్టివ్‌గా ఉన్నారు.

ఈ పరిస్థితుల్లో… సీనియర్‌ ఐపీఎస్ ఆఫీసర్‌ పీవీ సునీల్‌ కుమార్‌ తెరపైకి తెచ్చిన కొత్త ఫార్ములా హాట్‌ టాపిక్‌ అయింది. మనం కలుద్దాం. మీ కాపు నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకోండి. మా దళిత నేతకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వండని సునీల్‌ కుమార్‌ అనడంతో ఒక్కసారిగా రాజకీయ కలకలం రేగింది. అసలు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం వెనుక ఈ కాంబినేషనే గట్టిగా వర్కౌట్‌ అయిందన్న లెక్కలున్నాయి. చాలా మంది విశ్లేషకులు దాంతో ఏకీభవించారు కూడా. ఆ తర్వాత పరిస్థితులు, పరిణామాలు మారిపోయి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్లీ ఎన్నికలకు దాదాపు మూడున్నరేళ్ళ టైం ఉంది. ఇలాంటప్పుడు ఒక ఐపీఎస్‌ ఆఫీసర్‌ తన అధికారిక బౌండరీస్‌ అన్నీ దాటేసి కాపు, దళిత కాంబినేషన్‌ గురించి ప్రస్తావించడం వెనక కారణాలు ఏమై ఉంటాయా అంటూ రకరకాలుగా ఆరా తీస్తున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.

ప్రస్తుతం ఏపీలో సామాజికంగా, ఆర్ధికంగా బలంగా కనిపించే మూడు ప్రధాన సామాజిక వర్గాలు అధికార, విపక్ష పాత్రల్లో ఉన్నాయి. ఇక రాజకీయ శూన్యత అన్న మాటేలేదు. ఇలాంటప్పుడు సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన పీవీ సునీల్ కుమార్ అనకాపల్లి జిల్లా నుంచి ఈ కీల క ప్రతిపాదన చేయడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఉలిక్కిపడ్డాయట. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న ఈ సీనియర్ బ్యూరో క్రాట్ తెర పైకి తెచ్చిన ఫార్ములా చుట్టూ కొత్త కొత్త విశ్లేషణలు, వాటి చుట్టూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. మీ కాపు నాయకుణ్ణి మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి. మా దళిత నాయకుడిని ఉప ముఖ్య మంత్రి చేయండని ప్రతిపాదించారు సునీల్ కుమార్. అందుకు అర్హత కలిగిన నేతలు వీళ్ళే అంటు కొన్ని పేర్లు కూడా ప్రస్తావించారు. అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన ర్యాలీ, బహిరంగ సభలో సునీల్ కుమార్ ఈ ప్రతిపాదనలు చేయడం గురించి చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

రాష్ట్రంలో ప్రభావవంతంగా ఉండి, అత్యధిక జనాభా కలిగి, అధికారం కోసం చేసే ప్రయత్నంలో కాపు సామాజికవర్గం కొంత వరకు విజయంసాధించిందన్నది పొలిటికల్‌ పండిట్స్‌ మాట. అలాగే….జనాభా, ఓట్ల పరంగా బలమైన మరో సామాజికవర్గం అయిన ఎస్సీలు కాపులు కలిస్తే… బలం రెట్టింపు అవుతుందన్నది సునీల్‌కుమార్‌ లెక్క అట. మన డిమాండ్‌కు సహకరించమని కాపు సోదరులను కోరండి. అందరినీ కలుపుకునిపోయి మన అజెండా ఏంటో తెలియజేయండి. మీరు దళిట పంచాయితీకి మద్దతు నిస్తే మేము మీకు మద్దతిస్తామని చెప్పండంటూ గట్టి వ్యాఖ్యలే చేశారాయన. అది అక్కడితో ఆగిపోయి ఉంటే…వ్యవసాయ, గ్రామీణ నేపథ్యంలో దళిత వర్గాలతో వున్న నిత్య సంబంధాలు కారణంగా ఈ ప్రతిపాదన చేసి వుండవచ్చని భావించడానికి ఆస్కారం వుండేది. కానీ, సునీల్ కుమార్ దీనికి కొనసాగింపు ఇచ్చారు. నాకు ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తే కూడా వద్దని చెప్పి దళితవాడను పంచాయతీగా చేయాలని అడిగాను అని అన్నారు.

Also Read:Robin Smith: క్రీడాలోకంలో విషాదం.. లెజెండరీ ఇంగ్లాండ్ క్రికెటర్ కన్నుమూత..

సరిగ్గా ఈ కామెంట్స్ వెనుక ఖచ్చితమైన, నిర్ధిష్ట ప్రణాళికతో కూడిన ఓ రాజకీయ ప్రయత్నం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సునీల్ కుమార్‌కు టిక్కెట్ ఇస్తామని ఆఫర్ చేసిన రాజకీయ పార్టీ ఏది అన్న ప్రశ్న వస్తోంది. అలాగే.. అంతకు మించి ఏపీ భవిష్యత్ రాజకీయంలో ఆయన కీలకపాత్ర పోషించాలనుకుంటున్నారా అని కూడా సందేహాలు వస్తున్నాయట. పొలిటికల్ వ్యాక్యూమ్ లేదనే భావన నుంచి రెండు బలమైన సామాజిక వర్గాలు కలవడం ద్వారా థర్డ్ ఆల్ట్రనేటివ్ ఫోర్స్ అనే భావన కొత్త కాంబినేషన్‌ను తెర మీదికి తీసుకురావాలనుకుంటున్నట్టు అంచనా వేస్తున్నారు కొందరు. ఆ దిశగా కొంత కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, మేథావి వర్గం….బ్యూరోక్రసీలో తలపండిన వాళ్ళు అంతర్గతంగా సమావేశాలు పెట్టుకుంటున్నారని సమాచారం. ఇందు కోసం ప్రణాళికాబద్ధమైన డ్రైవ్ ఒకటి జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో… సునీల్ కుమార్ పేల్చింది సీమ టపాకాయో….లేక పొలిటికల్ ఆర్డీఎక్సో తేలాలంటే మరికొంత కాలం ఆగాల్సిందేనంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Exit mobile version