IPL 2024: ఐపీఎల్ చరిత్రలో రికార్డులకు తెలుగు రాష్ట్రాలు వేదికయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు హైదరాబాద్‌లో ఇటీవల నమోదు కాగా.. నేడు 2వ అత్యధిక స్కోరు వైజాగ్‌లో నమోదైంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ముంబై బౌలర్ల బౌలింగ్‌లో చితక బాదుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు మెరుపు అర్ధ సెంచరీలు చేయడంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి ఐపీఎల్ రికార్డులన్నీ బద్దలు కొట్టింది. అంతకుముందు 2013 సంవత్సరంలో పూణే వారియర్స్‌పై ఆర్సీబీ పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ రికార్డును హైదరాబాద్ బద్దలు కొట్టేసింది.
ఇదిలా ఉంటే.. నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరును నమోదు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాటర్లు చెలరేగి ఆడడంతో ఐపీఎల్ చరిత్రలో 2వ అత్యధిక స్కోరును సాధించారు. ఇప్పటివరకు 263 పరుగులతో 2వ అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ఆర్సీబీ ఉండగా.. దానిని కేకేఆర్ అధిగమించింది. ఇప్పుడు ఆర్సీబీ మూడో స్థానానికి చేరింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు.. ఒకానొక దశలో సన్‌రైజర్స్ రికార్డు(277)ను అధిగమిస్తారనే అంచనాలు కూడా నెలకొన్నాయి. చివరి ఓవర్‌లో ఇషాంత్ అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయడంతో రికార్డు స్కోర్‌ను కేకేఆర్ అధిగమించలేకపోయింది. ఈ రెండు రికార్డు స్కోర్లు తెలుగు రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. ఐపీఎల్‌లో మొదటి అత్యధిక స్కోరు హైదరాబాద్‌లో నమోదు కాగా.. రెండో అత్యధిక స్కోరు వైజాగ్‌లో నమోదైంది.
