ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత సీజన్‌కు సంబంధించిన సన్నాహాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాబోయే సీజన్ కోసం ఆటగాళ్ల మినీ వేలాన్ని డిసెంబరు 16న గోవా వేదికగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ వేలానికి సంబంధించిన సన్నాహక సమావేశాన్ని (బ్రీఫింగ్) డిసెంబరు 15న నిర్వహించనున్నారు. దీనికోసం అన్ని ఫ్రాంచైజీలకు ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
వేలం ప్రక్రియకు ముందే ఫ్రాంచైజీలు తమ జట్లలో రిటైన్, అలాగే రిలీజ్ చేసే ఆటగాళ్ల తుది జాబితాను సమర్పించడానికి నవంబరు 15ను గడువుగా నిర్ణయించారు. ఈ సమయానికల్లా ఏ ఫ్రాంచైజీ ఎంతమంది ఆటగాళ్లను తమ వద్దే ఉంచుకుంటుంది, ఎవరిని వేలంలోకి పంపుతుందనే అంశంపై స్పష్టత రానుంది. గతేడాది జరిగిన మెగా వేలం తర్వాత నిర్వహించనున్న తొలి మినీ వేలం ఇది కావడంతో, జట్లు తమలోని లోటుపాట్లను సరిదిద్దుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వనున్నాయి.
గత కొన్నేళ్లుగా ఐపీఎల్ వేలాన్ని దుబాయ్, జెడ్డా వంటి విదేశీ నగరాల్లో నిర్వహించగా, ఈసారి మళ్లీ భారత్‌లోని గోవా వేదికగా మినీ వేలం నిర్వహిస్తుండటం విశేషం. ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఆటగాళ్లతో పాటు కొత్తగా రిజిస్టర్ చేసుకునే ఆటగాళ్లు కూడా ఈ వేలంలో పాల్గొంటారు. నవంబరు 15 నాటికి రిటైన్ జాబితా ఖరారైన తర్వాతే, ప్రతి ఫ్రాంచైజీ వద్ద మిగిలి ఉన్న పర్స్ విలువ ఎంతనేది అధికారికంగా తెలుస్తుంది. దాని ఆధారంగానే జట్లు గోవా వేలంలో తమ వ్యూహాలను అమలు చేయనున్నాయి.

