క్రికెట్ ప్రపంచాన్ని ప్రస్తుతం 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో ఊపేస్తున్నాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ యువ ఆటగాడి విధ్వంసకర బ్యాటింగ్ చూసి దిగ్గజాలే ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్, ప్రస్తుత గుజరాత్ టైటాన్స్ ఆటగాడు జోస్ బట్లర్ పాల్గొన్న ఒక పాడ్‌కాస్ట్‌లో వైభవ్ ప్రదర్శనపై ఆసక్తికర చర్చ జరిగింది.
వైభవ్ క్రీజులోకి వస్తే చాలు తన స్నేహితుల వాట్సాప్ గ్రూప్ మోతెక్కిపోతుందని బ్రాడ్ వెల్లడించాడు. “వైభవ్ ఆట మొదలుపెట్టగానే గ్రూప్‌లో మెసేజ్‌ల వర్షం కురుస్తుంది. బౌన్సర్లు, యార్కర్లతో అతడిని కట్టడి చేయవచ్చని మేం అనుకునేలోపే.. ఊహించని షాట్లతో మమ్మల్ని ఆశ్చర్యపరుస్తాడు” అని బ్రాడ్ పేర్కొన్నాడు.
బట్లర్ మాట్లాడుతూ.. వైభవ్ పవర్‌ప్లే గణాంకాలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పాడు. పవర్‌ప్లేలో అతడి ‘బాల్స్ పర్ బౌండరీ’ రేటు కేవలం రెండుగా ఉందన్నాడు. అంటే పవర్‌ప్లేలో ఆడే ప్రతి రెండో బంతినీ అతడు ఫోర్ లేదా సిక్సర్‌గా మారుస్తున్నాడు.
రికార్డుల వేట…
వైభవ్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 53 సిక్సర్లు బాదాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఒకే సీజన్‌లో 59 సిక్సర్లతో టాప్‌లో ఉన్న క్రిస్ గేల్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టడానికి వైభవ్ కేవలం కొన్ని సిక్సర్ల దూరంలోనే ఉన్నాడు.
ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్న వైభవ్.. 13 ఇన్నింగ్స్‌ల్లో 44.53 సగటుతో, 236.32 స్ట్రైక్ రేట్‌తో 579 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ వండర్‌కిడ్ ఆట తీరుపై సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు సైతం ఫిదా అవుతున్నారు.
