ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నిర్ణీత 20 ఓవర్లలో 156/9 పరుగుల స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ప్రారంభంలోనే భారీ షాకులు తగిలాయి.
ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్లు ఘోరంగా విఫలమయ్యారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ఆటగాడు మహ్మద్ షమీ, తన పాత జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో తరపున బరిలోకి దిగిన షమీ, నిప్పులు చెరిగే బంతులతో హైదరాబాద్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. అభిషేక్ శర్మ (0), ట్రావిస్ హెడ్ (7)లను పెవిలియన్ పంపాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్ (1) కూడా త్వరగానే అవుట్ కావడంతో 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి SRH పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన లియామ్ లివింగ్‌స్టోన్ (14) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. 10 ఓవర్లకు కేవలం 35 పరుగులే చేసి అత్యల్ప స్కోరు దిశగా సాగుతున్న దశలో హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి జట్టును ఆదుకున్నారు.
హెన్రిచ్ క్లాసెన్ 41 బంతుల్లో 62 పరుగులు (5 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నితీష్ కుమార్ రెడ్డి 33 బంతుల్లో 56 పరుగులు (3 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. ఇతను తన అర్ధ సెంచరీ తర్వాత ‘పుష్ప’ స్టైల్లో సెలబ్రేట్ చేసుకోవడం హైలైట్‌గా నిలిచింది. చివర్లో అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి అవుట్ అవ్వడంతో స్కోరు వేగం తగ్గింది.
లక్నో బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి హైదరాబాద్‌ను కట్టడి చేశారు. ముఖ్యంగా పవర్ ప్లేలో షమీ వేసిన స్పెల్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. మహ్మద్ షమీ 4 ఓవర్లలో కేవలం 9 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. దిగ్వేష్ సింగ్ రాఠీ 4 ఓవర్లలో 46 పరుగులు ఇచ్చినప్పటికీ 1 వికేట్ పడగొట్టాడు. ప్రిన్స్ యాదవ్ 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. ఆవేష్ ఖాన్ 4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి 2 వికెట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.
మొత్తానికి 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగుతున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు ఇది సులువైన లక్ష్యంలా కనిపిస్తున్నప్పటికీ, ఉప్పల్ పిచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో స్లో అయ్యే అవకాశం ఉండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లు ఏ మేరకు అడ్డుకుంటారో చూడాలి.