SRH: సన్ రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్.. ఇంటికెళ్లిపోయిన స్టార్ ప్లేయర్..

Sun Risers Hyderabad

Sun Risers Hyderabad

ఐపీఎల్ 2026 సీజన్ మొదట్లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ అనూహ్యంగా స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు. దీంతో సీజన్ తొలి భాగంలో కమిన్స్ అందుబాటులో ఉండరనే వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆయన తొలి రెండు మ్యాచ్ లకు దూరం అయిన సంగతి తెలిసిందే.

పాట్ కమిన్స్ గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నారు. జూలై 2025 నుంచి ఈ గాయం అతడిని వేధిస్తోంది. ఐపీఎల్ కోసం భారత్‌కు వచ్చినప్పటికీ.. ప్రాక్టీస్ సెషన్లలో నొప్పి తీవ్రతరం కావడంతో మెరుగైన చికిత్స , విశ్రాంతి కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సూచన మేరకు ఆయన తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన సిడ్నీలో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందనున్నారు.

SRHలో చేరిక ఎప్పుడు..?
కమిన్స్ గైర్హాజరీ వల్ల సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ డైలమాలో పడింది. తాజా సమాచారం ప్రకారం, ఆయన కోలుకోవడానికి కనీసం కొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉంది. అన్నీ అనుకూలిస్తే, ఏప్రిల్ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో అంటే టోర్నమెంట్ రెండో భాగంలో ఆయన మళ్ళీ జట్టుతో కలిసే అవకాశం ఉంది. అప్పటివరకు జట్టుకు కెప్టెన్‌గా ఇషన్ కిషన్ వ్యవహరిస్తు్న్న సంగతి తెలిసిందే.

Also Read:Iran War: యూఏఈపై 450 క్షిపణి, 2,000 డ్రోన్ దాడులు.. అయినా యూఏఈ ఇరాన్‌తో ఎందుకు పోరాడటం లేదు..?

గత సీజన్లలో కమిన్స్ తన అద్భుతమైన నాయకత్వంతో సన్‌రైజర్స్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లారు. కేవలం బౌలర్‌గానే కాకుండా, లోయర్ ఆర్డర్‌లో మెరుపు బ్యాటింగ్‌తోనూ ఆయన జట్టుకు వెన్నెముకగా నిలిచారు. ఇప్పుడు కీలకమైన తొలి మ్యాచులకు ఆయన లేకపోవడం జట్టు వ్యూహాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్ల కోటాలో కమిన్స్ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులభం కాదు.

సన్‌రైజర్స్ అభిమానులు తమ ‘కెప్టెన్’ త్వరగా కోలుకుని మైదానంలోకి రావాలని కోరుకుంటున్నారు. టోర్నీ రెండో సగంలోనైనా ఆయన పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి వస్తే, జట్టు ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి కమిన్స్ ఆస్ట్రేలియాలో ఉండి తన రికవరీపై దృష్టి సారించనున్నారు.