Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..

Temple In Karman

Temple In Karman

ఐపీఎల్ 2026 సీజన్‌లో తన మెరుపు బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను వణికిస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (SRH) స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ, కీలక మ్యాచ్‌కు ముందు దైవదర్శనం చేసుకున్నారు. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించే ఈ యువ కెరటం, భక్తి భావంతో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.

ప్రస్తుత సీజన్‌లో అభిషేక్ శర్మ ఆడుతున్న తీరు అద్భుతం. సన్‌రైజర్స్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వడంలో ఆయనది కీలక పాత్ర. ముఖ్యంగా పవర్ ప్లే ఓవర్లలో క్రీజులోకి వచ్చిన క్షణం నుండే బౌండరీల వేట మొదలుపెడుతున్నారు. ఆయన కొట్టే భారీ సిక్సర్లు, వేగవంతమైన అర్ధ సెంచరీలు హైదరాబాద్ జట్టుకు భారీ స్కోర్లు అందించడంలో ప్రధాన బలమయ్యాయి. కేవలం పరుగులే కాకుండా, ఆయన ఆడుతున్న స్ట్రైక్ రేట్ చూస్తుంటే ప్రత్యర్థి జట్లకు చెమటలు పడుతున్నాయి.

హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు..
మే 3వ తేదీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR)తో సన్‌రైజర్స్‌ తలపడనుంది. ఈ కీలక పోరుకు ముందు అభిషేక్ శర్మ నగరంలోని కర్మన్‌ఘాట్‌ ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించారు. సాధారణ ఆఫ్-వైట్ టీ షర్ట్ ధరించి, నుదుట ఎర్రటి తిలకం దిద్దుకుని చాలా ప్రశాంతంగా కనిపించారు.

ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మ్యాచ్‌లో విజయం సాధించాలని మొక్కుకున్నారు. హనుమంతుడి విగ్రహం ముందు ఆయన భక్తితో చేతులు జోడించి ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నగరంలో ఉన్న సమయంలో అభిషేక్ శర్మ కేవలం కర్మన్‌ఘాట్ ఆలయమే కాకుండా, అంతకుముందు బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయాలను కూడా దర్శించుకోవడం విశేషం.

అభిషేక్ శర్మ పోస్ట్ చేసిన ఈ ఫోటోలపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. “జై భజరంగబలి” అంటూ కామెంట్స్ చేస్తూ, రేపటి మ్యాచ్‌లో ఆయన మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాలని ఆకాంక్షిస్తున్నారు. ఆటలో ఎంత వేగంగా ఉంటారో, బయట అంత ప్రశాంతంగా, సంప్రదాయబద్ధంగా ఉండటం చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు జరగబోయే ఈ మ్యాచ్ సన్‌రైజర్స్‌కు చాలా కీలకం. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగాలన్నా, ప్లే-ఆఫ్స్ దిశగా దూసుకుపోవాలన్నా అభిషేక్ శర్మ ఇచ్చే ఆరంభం జట్టుకు ఎంతో అవసరం. దైవ దీవెనలతో ఈ యువ ఆటగాడు రేపు మైదానంలో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచి చూడాలి.