Site icon NTV Telugu

SRH Vs RCB: తడబడ్డా.. నిలబడిన సన్‌రైజర్స్.. 201 పరుగులు చేసిన ఆరెంజ్ ఆర్మీ..

Download

Download

బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు కాస్త తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల స్కోరును సాధించి.. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు 202 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

ఇషాన్ మెరుపులు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ వర్మ త్వరగానే అవుట్ కావడంతో జట్టు కష్టాల్లో పడింది. అయితే.. కెప్టెన్ ఇషాన్ కిషన్ బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి హెన్రిచ్ క్లాసెన్ జతకలవడంతో ఇన్నింగ్స్ ఊపందుకుంది.

కీలక భాగస్వామ్యం..

నాలుగో వికెట్‌కు ఇషాన్ కిషన్ మరియు క్లాసెన్ (31) జోడి కేవలం 53 బంతుల్లోనే 97 పరుగుల మెరుపు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ జోడి ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడటంతో సన్‌రైజర్స్ భారీ స్కోరు దిశగా సాగింది.

క్లాసెన్ అవుట్ – వివాదం..

వరుస సిక్సర్లతో హోరెత్తించిన క్లాసెన్ 14వ ఓవర్‌లో వివాదాస్పద రీతిలో అవుట్ అయ్యాడు. రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్ పట్టిన క్యాచ్‌పై సందేహాలు వ్యక్తమయ్యాయి. సాల్ట్ కాలు బౌండరీ రోప్‌ను తాకినట్లు కనిపించినా, థర్డ్ అంపైర్ మాత్రం అవుట్ అని ప్రకటించారు. దీంతో తీవ్ర అసంతృప్తితో క్లాసెన్ పెవిలియన్ చేరాడు.

కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్ – అద్భుత క్యాచ్:
సెంచరీ దిశగా దూసుకుపోతున్న ఇషాన్ కిషన్ 38 బంతుల్లో 80 పరుగులు (8 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి ఫిల్ సాల్ట్ పట్టిన అద్భుత క్యాచ్‌కు అవుట్ అయ్యాడు. అభినందన్ వేసిన ఫుల్ టాస్ బంతిని కిషన్ బలంగా బాదగా.. పాయింట్ వద్ద సాల్ట్ గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకున్నాడు. చివర్లో సలీల్ అరోరా (9) వంటి వారు తక్కువ పరుగులకే పరిమితమైనా, మిగిలిన బ్యాటర్లు రాణించడంతో హైదరాబాద్ జట్టు 201 పరుగుల గౌరవప్రదమైన స్కోరును అందుకుంది.

Exit mobile version