Site icon NTV Telugu

BCCI: కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. నిజామాబాద్‌లో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు..

Fan Park In Nizamabad

Fan Park In Nizamabad

క్రికెట్ పండుగ ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుండటంతో అభిమానుల్లో జోష్ నెలకొంది. ఈసారి తెలంగాణలోని క్రికెట్ ప్రియులకు, ముఖ్యంగా నిజామాబాద్ వాసులకు బీసీసీఐ అదిరిపోయే తీపి కబురు అందించింది. ఐపీఎల్ ఉత్సాహాన్ని స్టేడియం బయట కూడా పంచేందుకు ఏర్పాటు చేస్తున్న ‘ఐపీఎల్ ఫ్యాన్ పార్క్’ వేదికల జాబితాలో నిజామాబాద్ చోటు సంపాదించుకుంది.

సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లు హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లోనే జరుగుతుంటాయి. కానీ, స్టేడియానికి వెళ్లలేని అభిమానుల కోసం బీసీసీఐ 2015లో ‘ఫ్యాన్ పార్క్’ అనే అద్భుతమైన కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో 2026 సీజన్ రెండో వారంలో.. అంటే ఏప్రిల్ 4 మరియు 5 తేదీల్లో (శని, ఆదివారాలు) నిజామాబాద్ నగరంలో ఈ ఫ్యాన్ పార్కును ఏర్పాటు చేయనున్నారు.

ఫ్యాన్ పార్కులో ఏమేమి ఉంటాయి..?

కేవలం మ్యాచ్ చూడటమే కాకుండా, ఒక మినీ స్టేడియం వాతావరణాన్ని ఇక్కడ కల్పిస్తారు. భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. వేల మంది అభిమానుల మధ్య కేకలు వేస్తూ మ్యాచ్ చూడటం స్టేడియం అనుభూతిని ఇస్తుంది. మ్యూజిక్, డీజే హంగామాతో పాటు ఫుడ్ కోర్టులు అందుబాటులో ఉంటాయి. చిన్నారుల కోసం ప్రత్యేక ఆట స్థలాలు, వర్చువల్ బ్యాటింగ్, బౌలింగ్ నెట్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఫేస్ పెయింటింగ్, ఫొటో బూత్స్ వంటి సౌకర్యాలతో అభిమానులు తమకు ఇష్టమైన జట్టుకు మద్దతు తెలపవచ్చు.

ఐపీఎల్ 2026 మార్చి 28న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోరుతో ప్రారంభం కానుంది. తొలి విడతలో 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేసిన బీసీసీఐ, మూడు వారాల పాటు వివిధ నగరాల్లో ఫ్యాన్ పార్కులను నిర్వహించనుంది.

మొదటి వారంలో అంటే.. మార్చి 28, 29న రోహ్‌తక్, భోపాల్ వంటి నగరాల్లో ఉంటుంది. రెండో వారంలో ఏప్రిల్ 4, 5 తేదీల్లో నిజామాబాద్‌తో పాటు మథుర, జోధ్‌పుర్, మైసూరు, భువనేశ్వర్‌లలో ఈ సందడి నెలకొంటుంది. మూడో వారంలో.. ఏప్రిల్ 11, 12 తేదీల్లో మేరఠ్, కోయంబత్తూర్ వంటి నగరాల్లో ఏర్పాటు చేస్తారు.

Exit mobile version