Site icon NTV Telugu

IPL 2026 Begins Today: ధన్ ధనాధన్.. IPL 2026 నేటి నుంచి షురూ..!

Ipl 2026 (1)

Ipl 2026 (1)

IPL 2026 Begins Today: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న నిరీక్షణ ముగిసింది. నేటి నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) 19వ సీజన్ మొదలు కాబోతుంది. దాదాపు రెండు నెలల పాటు అభిమానులను అలరించే ఈ లీగ్‌లో మే 24 వరకు లీగ్ దశ మ్యాచ్‌లు జరగనుండగా, మే 31న ఫైనల్ పోరు జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నేటి రాత్రి 7 గంటలకు జరిగే తొలి మ్యాచ్‌ తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది.

గతేడాది తొలిసారి టైటిల్ ను గెలుచుకున్న ఆర్సీబీ ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌ గా బరిలోకి దిగుతుండగా.. మరోవైపు సన్‌ రైజర్స్ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పటికీ.. బీసీసీఐ ఎన్నికల తేదీలను పరిగణనలోకి తీసుకుని రెండు దశల్లో పూర్తి షెడ్యూల్‌ ను విడుదల చేసింది. 15 రోజుల పాటు సాగే తొలి దశ షెడ్యూల్ మార్చి 28 నుండి ఏప్రిల్ 12 వరకు జరగనుంది.

RCB vs SRH: బౌలర్లు vs బ్యాటర్లు.. ఇరు జట్లలో స్టార్ పేసర్లు దూరం.. ఓపెనింగ్‌లోనే హై వోల్టేజ్ ఫైట్!

2022 నుండి అమలవుతున్న ఫార్మాట్ ప్రకారమే ఈ సీజన్ కూడా సాగనుంది. మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-Aలో సీఎస్‌కే, కేకేఆర్, ఆర్ఆర్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ఉండగా.. గ్రూప్-Bలో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు 14 మ్యాచ్‌ లు చొప్పున మొత్తం 70 మ్యాచ్‌లు ఆడతాయి.

ఇందులో తమ గ్రూప్‌ లోని మిగిలిన నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్‌ లు, ఇతర గ్రూప్‌ లో తమ స్థానంలో ఉన్న జట్టుతో రెండు మ్యాచ్‌ లు, మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. లీగ్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. టాప్-2 జట్ల మధ్య క్వాలిఫయర్-1, మూడు & నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత క్వాలిఫయర్-1 లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్-2 లో తలపడుతుంది. మే 31న జరిగే ఫైనల్ పోరులో క్వాలిఫయర్-1 & క్వాలిఫయర్-2 విజేతలు టైటిల్ కోసం తాడోపేడో తేల్చుకుంటారు.

సాధారణంగా ప్రతి ఐపీఎల్ సీజన్ ఆరంభంలో అట్టహాసంగా ప్రారంభ వేడుకలు (Opening Ceremony) నిర్వహిస్తారు. కానీ ఈసారి బీసీసీఐ ప్రారంభ వేడుకలను రద్దు చేసింది. దీనికి కారణం గత ఏడాది ఆర్సీబీ విజయోత్సవాల్లో స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఆ బాధిత కుటుంబాల పట్ల గౌరవార్థం ఈసారి వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఆ మృతుల జ్ఞాపకార్థం చిన్నస్వామి స్టేడియంలో 11 సీట్లను శాశ్వతంగా ఖాళీగా ఉంచాలని నిర్ణయించింది. ఆర్సీబీ ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ సెషన్‌లో తమ జెర్సీలపై 11వ నెంబర్ ధరించి నివాళులర్పించారు.

Nepal Political Crisis: నేపాల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ అరెస్ట్స్.. మాజీ ప్రధాని ఓలీ, మాజీ హోం మంత్రి అరెస్ట్!

ఐపీఎల్ చరిత్రలోనే ఇది వరకు ఎప్పుడు లేని విధంగా ఈ సీజన్‌ లో మొత్తం 10 జట్లకు భారత ఆటగాళ్లే సారథ్యం వహిస్తుండటం ఓ విశేషం. ముంబై ఇండియన్స్‌ కు హార్దిక్ పాండ్యా, సీఎస్‌కే కు రుతురాజ్ గైక్వాడ్, ఢిల్లీ క్యాపిటల్స్‌ కు అక్షర్ పటేల్, పంజాబ్ కింగ్స్‌ కు శ్రేయస్ అయ్యర్, కేకేఆర్‌ కు అజింక్యా రహానె, లక్నో సూపర్ జెయింట్స్‌ కు రిషబ్ పంత్, గుజరాత్ టైటాన్స్‌ కు శుభ్‌మన్ గిల్, ఆర్సీబీకి రజత్ పాటిదార్, రాజస్థాన్ రాయల్స్‌ కు రియాన్ పరాగ్ నాయకత్వం వహిస్తున్నారు. కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా తొలి కొన్ని మ్యాచ్‌ లకు అందుబాటులో లేకపోవడంతో తాత్కాలిక కెప్టెన్‌ గా ఇషాన్ కిషన్‌ కు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఈ సీజన్ అంతా స్వదేశీ కెప్టెన్ల హవా నడవనుంది.

ఇక నేడు చిన్నస్వామి స్టేడియంలో జరగబోయే తొలి మ్యాచ్‌ లో ఆర్సీబీ, సన్‌రైజర్స్ జట్లను బౌలింగ్ సమస్యలు వేధిస్తున్నాయి. ఆర్సీబీ ప్రధాన బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ గాయంతో టోర్నీ మధ్యలో వచ్చే అవకాశం ఉండగా.., వ్యక్తిగత కారణాల వల్ల లెఫ్ ఆర్మ్ సీమర్ యశ్ దయాల్ ఈ సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. దీంతో వెటరన్ భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ, మంగేష్ యాదవ్‌ లపైనే బౌలింగ్ భారం పడింది. మరోవైపు సన్‌రైజర్స్ జట్టులో హర్షల్ పటేల్, జైదేవ్ ఉనద్కత్, హర్ష్ దూబే వంటి బౌలర్లు ఉన్నా చిన్నస్వామి వంటి ఫ్లాట్ పిచ్‌ లపై వారి ప్రదర్శన ప్రశ్నర్ధకంగా మారింది. అయితే ఇరు జట్లు తమ బ్యాటింగ్ బలంతో ఈ లోటును పూడ్చుకోవాలని చూస్తున్నాయి. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్, జాకబ్ బెథెల్‌లతో ఆర్సీబీ లైనప్ బలంగా ఉండగా.. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, లివింగ్‌స్టోన్‌లతో సన్‌రైజర్స్ ధీటుగా సమాధానం ఇచ్చేందుకు సిద్ధమైంది.

Astrology: మార్చి 28, శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..

దేశవ్యాప్తంగా ముంబై, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ, హైదరాబాద్, అహ్మదాబాద్, ధర్మశాల, గువహటి, లక్నో, న్యూ చండీగఢ్, జైపూర్ వంటి 12 వేదికల్లో ఈ ఐపీఎల్ మహా సంగ్రామం జరగనుంది. వీకెండ్స్‌ లో డబుల్ హెడర్స్ మ్యాచ్‌ లు మధ్యాహ్నం 3:30 గంటలకు, సాధారణ రోజుల్లో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌ లు ప్రారంభమవుతాయి. ఈ మ్యాచ్‌ లన్నింటినీ టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో, ఓటీటీలో జియో హాట్ స్టార్ యాప్, వెబ్‌ సైట్ ద్వారా లైవ్‌ లో వీక్షించవచ్చు. తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ, గుజరాతి, బెంగాలీ, మళయాళం వంటి సహా పలు భారతీయ భాషల్లో కామెంట్రీ అందుబాటులో ఉండనుంది.

Exit mobile version