NTV Telugu Site icon

MI vs RCB: బుమ్రా వేసిన తొలి బంతికే ఫోర్‌ లేదా సిక్స్‌ కొడతా: టిమ్‌ డేవిడ్

Tim David Bumrah

Tim David Bumrah

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగు నెలల తర్వాత మైదానంలోకి దిగేందుకు సిద్దమయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో నేడు జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున బుమ్రా ఆడనున్నాడు. గత జనవరిలో గాయపడిన బుమ్రా.. ఆర్సీబీతో మ్యాచ్‌లోనే ఆడతాడని ఇప్పటికే ముంబై కోచ్‌ వెల్లడించాడు. బుమ్రా ఐపీఎల్‌ ఎంట్రీ నేపథ్యంలో ఆర్సీబీ ఆటగాడు టిమ్‌ డేవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా వేసిన తొలి బంతికే ఫోర్‌ లేదా సిక్స్‌ కొట్టేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు.

ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టిమ్‌ డేవిడ్ మాట్లాడుతూ… ‘జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. అతడు వేసే యార్కర్లను అడ్డుకోవడం చాలా కష్టం. ఆర్సీబీకి ఇదే సవాలుగా మారనుంది. నేను అత్యుత్తమ సవాల్‌ ఉండాలని కోరుకుంటా. ముంబై మ్యాచ్‌ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నా. ఈ టోర్నమెంట్‌లో మనం రాణించాలంటే.. ఉత్తమ జట్లను, ఉత్తమ ఆటగాళ్లను ఓడించాలి. గొప్ప క్రికెటర్లతో నాణ్యమైన క్రికెట్ ఆడితే ఆ ఫీలింగ్‌ వేరేగా ఉంటుంది. రేపు బుమ్రా మ్యాచ్ ఆడతాడని భావిస్తున్నా. ఆర్సీబీ జట్టులో ఎవరు బుమ్రాను ఎదుర్కొన్నా.. తొలి బంతికే ఫోర్‌ లేదా సిక్స్‌ కొట్టేందుకు ప్రయత్నిస్తాం’ అని సవాల్ విసిరాడు.

Also Read: Yuzvendra Chahal: రూ.18 కోట్లకు నేను అర్హుడినే.. యూజీ ఆసక్తికర వ్యాఖ్యలు!

‘జస్ప్రీత్ బుమ్రా మళ్లీ మైదానంలోకి దిగడం చాలా ఆనందంగా ఉంది. అతడి రాకతో మ్యాచ్‌ మరింత రసవత్తరంగా మారుతుంది. నేను మళ్లీ ముంబై నగరంకు రావడం బాగుంది. ఇక్కడ నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఐపీఎల్ 2025లో ఇదొక ఆసక్తికరమైన అనుభవం. మ్యాచ్ గెలిచేందుకు ప్రయత్నిస్తాం. మా అత్యుత్తమ ఆట ఆడుతాం’ అని టిమ్ డేవిడ్ తెలిపాడు. ప్రస్తుత సీజన్‌లో డేవిడ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 22 (8 బంతుల్లో) పరుగులు చేశాడు. గుజరాత్ జట్టుపై మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 32 (18 బంతుల్లో) పరుగులు చేశాడు. గత సీజన్‌ వరకూ టిమ్ డేవిడ్ ముంబై ఫ్రాంచైజీకే ఆడిన సంగతి తెలిసిందే.