Site icon NTV Telugu

Rohit Sharma: టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు!

Rohit Sharma Record

Rohit Sharma Record

టీ20 క్రికెట్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో 12 వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారతీయుడిగా రోహిత్ రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై (70; 46 బంతుల్లో 8×4, 3×6) హాఫ్ సెంచరీ బాదడంతో ఈ మైలురాయిని సాధించాడు. జాబితాలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (13,208) హిట్‌మ్యాన్ కంటే ముందున్నాడు.

మొత్తంగా టీ20 క్రికెట్‌లో 12 వేల పరుగులు చేసిన ఎనిమిదవ ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డుల్లో నిలిచాడు. పొట్టి ఫార్మాట్‌లో హిట్‌మ్యాన్ ఇప్పటివరకు 456 టీ20లలో 12,056 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 79 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (14,562) ముందున్నాడు. అలెక్స్ హేల్స్ (13,610), షోయబ్ మాలిక్ (13,571), కీరన్ పొలార్డ్ (13,537), విరాట్ కోహ్లీ (13,208), డేవిడ్ వార్నర్ (13,019), జోస్ బట్లర్ (12,469) తరువాతి స్థానాల్లో ఉన్నారు.

రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 159 మ్యాచ్‌లు ఆడి 4231 రన్స్ చేశాడు. ఇందులో 5 శతకాలు, 32 అర్ధ శతకాలు ఉన్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం రోహిత్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. 265 ఐపీఎల్ మ్యాచ్‌లలో 6856 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో హిట్‌మ్యాన్ 2 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు బాదాడు. ఐపీఎల్‌లో ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ఉన్నాడు. విరాట్ కోహ్లీ (8326) రోహిత్ అగ్ర స్థానంలో ఉన్నాడు.

Exit mobile version