NTV Telugu Site icon

IPL 2025: ఫ్రాంచైజీల డిమాండ్‌కే బీసీసీఐ మొగ్గు.. ఎంతమందిని రిటైన్ చేసుకోవచ్చంటే?

Ipl 2025 Retention

Ipl 2025 Retention

BCCI on IPL 2025 Retention: ఐపీఎల్ 2025కి సంబంధించి రిటెన్షన్, మెగా వేలం కోసం తేదీని బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే నివేదికల ప్రకారం.. నవంబర్‌ నెలలో మెగా వేలం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. భారతదేశంలో కాకుండా విదేశాలలో వేలం ప్రక్రియ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ప్రస్తుతం మెగా వేలంపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. రిటెన్షన్ పాలసీ గురించి ఇప్పటికే ఫ్రాంచైజీలతో సమావేశమైన బీసీసీఐ.. అధికారికంగా ప్రకటించేందుకు మాత్రం సమయం తీసుకుంటోంది. రిటెన్షన్ పాలసీపై బీసీసీఐ, ప్రాంచైజీల మధ్య సమావేశం అసంతృప్తిగా ముగియడమే ఇందుకు కారణం.

ఎక్కువ మందికి రిటెన్షన్ అనుమతి ఇవ్వాలని బీసీసీఐని ప్రాంచైజీలు కోరుతున్నాయట. అందుకే రిటెన్షన్ పాలసీని ప్రకటించేందుకు బీసీసీఐ సమయం తీసుకుంటున్నది. అయితే ఫ్రాంచైజీల డిమాండ్‌కే బీసీసీఐ మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. ప్రతీ ప్రాంచైజీకి నలుగురు ఆటగాళ్ల రిటెన్షన్‌, రెండు రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎమ్) కార్డ్స్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఆరుగురు ఆటగాళ్లను ప్రతీ టీమ్ అట్టిపెట్టుకోవచ్చు. అంటే నలుగురిని నేరుగా రిటైన్ చేసుకుంటే.. మరో ఇద్దరిని వేలంలో ఆర్‌టీఎమ్ ద్వారా తిరిగి కొనుగోలు చేయవచ్చు. ఇందులో అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్స్ కూడా ఉంటారు.

Also Read: IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన నిర్ణయం.. రిటైన్ లిస్ట్ ఇదే!

బీసీసీఐ, ప్రాంచైజీల మధ్య ముగ్గురు ఆటగాళ్ల రిటెన్షన్ గురించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నలుగురు ఆటగాళ్ల రిటైన్‌కే ఎక్కువ ఫ్రాంచైజీలు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ముగ్గురు ఆటగాళ్ల రిటెన్షన్‌తో పాటు మూడు ఆర్‌టీఎమ్ కార్డ్స్ ఇవ్వాలని ప్రాంఛైజీలు డిమాండ్ చేశాయట. దాంతో బీసీసీఐ నలుగురు ఆటగాళ్ల రిటెన్షన్‌తో పాటు రెండు ఆర్‌టీఎమ్ కార్డ్స్ ఇచ్చేందుకు మొగ్గు చూపినట్లు సమాచారం. ఇందులో మార్క్యూ ఆటగాళ్లతో పాటు ఎమర్జింగ్ ప్లేయర్స్, అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్లను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. త్వరలోనే రిటెన్షన్ పాలసీ గురించి బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనుంది.