ఐపీఎల్ 2025లో హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తొలి విజయాన్ని అందుకుంది. 18వ సీజన్‌లో భాగంగా గురువారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ 11 పరుగుల తేడాతో గెలుపొందింది. 206 పరుగుల ఛేదనలో రాజస్థాన్ 9 వికెట్లకు 194 పరుగులే చేసి ఓడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ (70; 42 బంతుల్లో 8×4, 2×6) తో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆర్సీబీ విజయంపై విరాట్ స్పందించాడు.
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… ‘చిన్నస్వామి స్టేడియంలో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. బ్యాటింగ్ యూనిట్‌గా మేము కొన్ని విషయాలను చర్చించాము. మా ప్రణాళిక సింపుల్. ఒక బ్యాటర్ క్రీజ్‌లో పాతుకుపోతే, మిగిలిన బ్యాటర్లు అటాక్ చేయాలి. ఈరోజు నేను బాధ్యత తీసుకున్నా. చిన్నస్వామి పిచ్ ఎలా స్పందిస్తుందో నాకు ఓ అవగాహన ఉంది. దేవదత్ పడిక్కల్ ఎటాకింగ్ చేశాడు. ఫిల్ సాల్ట్ కూడా బాగా ఆడాడు. త్వరగా వికెట్లను కోల్పోయిన సందర్భాల్లో ఇన్నింగ్స్‌ను నిర్మించేందుకు జట్టులో తర్వాత బ్యాటర్లు సిద్ధంగా ఉన్నారు. గత మూడు మ్యాచుల్లో కొత్త బంతిని షాట్లు కొట్టేందుకు ప్రయత్నించాము. ఈసారి మాత్రం బంతిని అంచనా వేసి ఖాళీలు చూసి బౌండరీకి పంపించాం’ అని చెప్పాడు.
Also Read: Nehal Wadhera: విరాట్ నా పేరు గుర్తు పెట్టుకోవడమా.. షాక్‌కు గురయ్యా!
‘ఒక దశలో 200 ప్లస్ స్కోరు సరిపోతుందనుకున్నా. రాజస్థాన్ ఆరంభం చూశాక ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే బాగుండు అనిపించింది. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. సరైన సమయంలో బ్రేక్ ఇచ్చారు. గత మూడు మ్యాచుల్లో 25-30 పరుగులు తక్కువగా చేశాం. ఇప్పుడు అవే రన్స్ మాకు కలిసొచ్చాయి. ఐపీఎల్‌లో అత్యుత్తమ వేదిక బెంగళూరు. అభిమానులు మాకు ఎప్పుడూ మద్దతుగా నిలిచారు. టాస్ ఎప్పుడూ కీలకమే కానీ.. మాకు కలిసిరాలేదు. చిన్నస్వామిలో రెండో ఇన్నింగ్స్‌లో తేమ ప్రభావం ఉంటుంది. బౌలర్లకు బంతిపై గ్రిప్ దొరకడం కష్టం. ఇక్కడ ఛేజింగ్ చేసే జట్టుకు అడ్వాంటేజ్. తొలి ఇన్నింగ్స్‌లో భారీగా పరుగులు చేస్తేనే విజయంపై నమ్మకంగా ఉండొచ్చు. ఈ విజయంతో చాలా సంతోషంగా ఉన్నాం’ అని విరాట్ కోహ్లీ చెప్పాడు.
