Site icon NTV Telugu

Virat Kohli: ఎప్పుడూ అహానికి పోను.. విరాట్‌ కోహ్లీ కీలక వ్యాఖ్యలు!

Virat Kohli Rcb

Virat Kohli Rcb

మైదానంలో మ్యాచ్ పరిస్థితులకు తగినట్లు బ్యాటింగ్‌ చేయాలనుకుంటానని, అస్సలు అహానికి పోనని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఎల్లప్పుడూ మ్యాచ్‌ పరిస్థితులకు తగినట్లు అర్థం చేసుకుని తాను బ్యాటింగ్ చేస్తానని చెప్పాడు. ఎప్పుడూ ఒకరిని అధిగమించాలని చూడనని విరాట్ చెప్పుకొచ్చాడు. ఆధునిక క్రికెట్లో అత్యంత విజయవంతమైన క్రికెటర్లలో కోహ్లీ ఒకడు. ఐపీఎల్ 2025 సందర్భంగా టీ20 క్రికెట్లో 13 వేల పరుగుల మైలురాయిని అందుకున్న భారత తొలి బ్యాటర్‌గా అరుదైన ఘనతను అందుకున్నాడు.

తాజాగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ తన బ్యాటింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘నేను బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు ఎప్పుడూ అహానికి పోను. ఎప్పుడూ కూడా ఒకరిని అధిగమించాలని అస్సలు చూడను. మ్యాచ్‌ పరిస్థితులను అర్థం చేసుకుని, అందుకు తగినట్లు బ్యాటింగ్ చేస్తా. పరిస్థితులు డిమాండ్‌ చేసినట్లు ఆడతా. అందుకు నేను చాలా గర్విస్తా. నేను మంచి లయలో ఉంటే ధాటిగా ఆడేందుకు ప్రయత్నిస్తా. నా సహచర ప్లేయర్ దూకుడుగా ఆడుతుంటే.. అతడికే మద్దతిస్తా. ఎప్పుడూ బంతిని చూసి ఆడుతా. ప్రాక్టీస్ చేస్తేనే సక్సెస్ అవుతాం’ అని విరాట్ తెలిపాడు.

‘ఐపీఎల్‌లో మొదటి నుంచి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకే ఆడుతున్నా. తొలి మూడేళ్లలో టాప్‌ ఆర్డర్‌లో ఆడే అవకాశాలు పెద్దగా రాలేదు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నేను దిగువన వచ్చేవాడిని. ఆ సమయంలో పెద్దగా రన్స్ చేయలేదు. 2010 నుంచి నిలకడగా ప్రదర్శన చేయడం మొదలెట్టా. 2011 నాటికి నేను రెగ్యులర్‌ నంబర్‌.3 ఆటగాడిగా మారిపోయా. ఆ సమయంలోనే నా ఐపీఎల్‌ ప్రయాణం ఓ రూపు సంతరించుకుంది’ అని విరాట్ కోహ్లీ చెప్పాడు. 2008 నుంచి ఆర్సీబీ తరఫున కింగ్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 256 మ్యాచ్‌ల్లో 8 సెంచరీలతో 8168 పరుగులు చేశాడు.

Exit mobile version