NTV Telugu Site icon

RCB Captain: ఆర్సీబీకి కొత్త కెప్టెన్.. అస్సలు ఊహించలేరు!

RCB New Captain

RCB New Captain

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) ప్రాంచైజీ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. యువ బ్యాటర్ రజత్ పటీదార్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ ఆర్సీబీ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. రజత్ పాటిదార్, కృనాల్ పాండ్యాలు ఆర్సీబీ కెప్టెన్‌ రేసులో ఉన్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

గత సీజన్‌లో జట్టుకు సారథ్యం వహించిన దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు ఫాఫ్‌ డుప్లెసిస్‌ను ఆర్సీబీ రిటైన్‌ చేసుకోలేదు. మెగా వేలంలో కూడా అతడిని తీసుకోలేదు. ఇక స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టులో ఉన్నప్పటికీ కెప్టెన్సీ వైపు మొగ్గు చూపలేదు. జట్టు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రజత్‌ పటీదార్‌కు ఆర్సీబీ మేనేజ్‌మెంట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. దాంతో ఆర్సీబీకి 8వ కెప్టెన్ అయ్యాడు 31 ఏళ్ల రజత్‌. 2021లో ఐపీఎల్‌లో అడుగు పెట్టిన రజత్‌.. ఇప్పటి వరకు 27 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 34.74 సగటుతో 799 పరుగులు చేశాడు. ఇక 2023లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసి ఇప్పటివరకు మూడు టెస్టులు, ఒక్క వన్డే మాత్రమే ఆడాడు.

ఆర్సీబీ జట్టుకు ఇప్పటివరకు 7 మంది కెప్టెన్సీ వహించారు. రాహుల్ ద్రవిడ్ (2008), కెవిన్‌ పీటర్సన్ (2009 – స్టాండ్‌ఇన్‌ కెప్టెన్), అనిల్ కుంబ్లే (2009-10), డానియల్ వెటోరీ (2011-12), విరాట్ కోహ్లీ (2011-2021, 2023 స్టాండ్‌ఇన్‌ కెప్టెన్), షేన్ వాట్సన్ (2017 – స్టాండ్‌ఇన్‌ కెప్టెన్), ఫాఫ్‌ డుప్లెసిస్‌ (2022-24)లు బెంగళూరు జట్టుకు బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు రజత్ పటీదార్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు సిద్దమయ్యాడు. రజత్ అయినా ఆర్సీబీకి కప్ అందిస్తాడేమో చూడాలి.