NTV Telugu Site icon

PBKS vs RCB: నేడే క్వాలిఫయర్‌ 1.. ఫైనల్లో తొలి అడుగు ఎవరిదో?

Ipl 2025 Qualifier 1 Pbks Vs Rcb

Ipl 2025 Qualifier 1 Pbks Vs Rcb

ఐపీఎల్‌ 2025లో ప్లేఆఫ్స్‌కు వేళైంది. నేడు ముల్లాన్‌పుర్‌ (చండీగఢ్‌)లో తొలి క్వాలిఫయర్‌ జరగనుంది. లీగ్‌ దశలో పాయింట్ల పట్టికలో టాప్‌-2లో నిలిచిన పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు క్వాలిఫయర్‌ 1లో తలపడనున్నాయి. క్వాలిఫయర్‌ 1లో విజేతగా నిలిచిన టీమ్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు మాత్రం ఫైనల్లో చోటు కోసం ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్‌ 2లో తలపడాల్సి ఉంటుంది. బెంగళూరు, పంజాబ్ జట్లు మంచి ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో హోరీహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. మ్యాచ్ రాత్రి 7.30 నుంచి ఆరంభం అవుతుంది.

ఐపీఎల్ 2025 ఆరంభం నుంచి ఆర్సీబీ అద్భుతంగా రాణిస్తోంది. బయటి మైదానాల్లోని మ్యాచ్‌లు అన్నీ గెలిచింది. లీగ్ చివరి మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించి రెట్టించిన ఉత్సాహంతో క్వాలిఫయర్‌ 1కు సిద్ధమైంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సూపర్‌ ఫామ్‌లో ఉండడం ఆర్సీబీకి పెద్ద సానుకూలాంశం. మరో ఓపెనర్‌ ఫిల్ సాల్ట్‌ విధ్వంసం సృష్టిస్తున్నాడు. రజత్ పాటీదార్, జితేశ్‌ శర్మలు ఫామ్ ఆందుకున్నారు. షెఫర్డ్ రాణిస్తుండగా.. లివింగ్‌స్టన్ మాత్రం నిరాశ పరుస్తున్నాడు. కీలక మ్యాచులో లివింగ్‌స్టన్ జట్టును ఆడుకుంటే తిరుగుండదు. తొడకండరాల గాయంతో బాధపడుతోన్న టిమ్‌ డేవిడ్‌ అందుబాటులో ఉండే అవకాశం లేదు. జోష్‌ హేజిల్‌వుడ్‌ ఫిట్‌నెస్‌ సాధించాడు. హేజిల్‌వుడ్‌ రాకతో గత మ్యాచ్‌లో సూపర్‌గా బౌలింగ్‌ చేసిన నువాన్‌ తుషార బెంచ్‌కే పరిమితం కానున్నాడు. భువనేశ్వర్, యశ్‌ దయాళ్, షెపర్డ్‌, కృనాల్, సుయశ్‌తో బౌలింగ్ బాగుంది.

పంజాబ్‌ బ్యాటింగ్‌ బలంగా ఉంది. ఓపెనర్లు ప్రియాంశ్‌ ఆర్య, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ మంచి పునాది వేస్తుంటే.. శ్రేయస్ అయ్యర్, ఇంగ్లిస్‌లు చెలరేగి ఆడుతున్నారు. నేహాల్‌ వధేరా పరుగులు చేస్తుండగా.. శశాంక్‌ సింగ్‌ ఫినిషర్‌గా రాణిస్తున్నాడు. స్టాయినిస్‌ కూడా ఫామ్‌ను అందుకుంటే పంజాబ్‌ భారీ స్కోర్ చేయడం ఖాయం. ఫాస్ట్‌బౌలర్‌ మార్కో జాన్సెన్ స్వదేశం వెళ్లిపోవడం ప్రతికూలాంశం. జాన్సెన్ స్థానంలో ఆల్‌రౌండర్‌ అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ జట్టులోకి రావొచ్చు. అర్ష్‌దీప్‌, జేమీసన్‌ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. వేలి గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమైన చహల్‌.. ఈ మ్యాచ్‌తో ఆడనున్నాడు. స్పిన్నర్ బ్రార్‌ రాణిస్తుండడం కలిసొచ్చే అంశం. పంజాబ్‌ జట్టు బౌలింగ్ కంటే బ్యాటింగ్‌ బలంగా ఉంది.

ముల్లాన్‌పుర్‌లో నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. తొలి రెండు మ్యాచ్‌లో 200 ప్లస్ స్కోర్లు నమోదయ్యాయి. అయితే చివరి రెండు మ్యాచ్‌ల్లో మాత్రం తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. దాంతో ఈరోజు పిచ్‌ ఎలా ఉండబోతుందున్నది ఆసక్తికరంగా మారింది. క్వాలిఫయర్‌ 1 మ్యాచ్‌కు ఎలాంటి వర్షం ముప్పు లేదు. ఈ సీజన్‌లో పంజాబ్‌, బెంగళూరు టీమ్స్ రెండు సార్లు తలపడగా.. చెరోసారి గెలిచాయి. ఐపీఎల్‌లో ఇరు జట్ల మధ్య 35 మ్యాచ్‌లు జరగగా.. పంజాబ్‌ 18, బెంగళూరు 17 గెలిచింది.

తుది జట్లు (అంచనా):
పంజాబ్‌: ప్రియాంశ్‌ ఆర్య, ప్రభ్‌సిమ్రన్, ఇంగ్లిస్, శ్రేయస్‌ అయ్యర్, నేహాల్‌ వధేరా, స్టాయినిస్, అజ్మతుల్లా, జేమీసన్, హర్‌ప్రీత్‌ బ్రార్, అర్ష్‌దీప్, చహల్‌.
బెంగళూరు: కోహ్లీ, సాల్ట్, మయాంక్‌ అగర్వాల్, పాటీదార్, జితేశ్‌ శర్మ, కృనాల్‌ పాండ్య, లివింగ్‌స్టన్, షెఫర్డ్, భువనేశ్వర్, యశ్‌ దయాళ్, హేజిల్‌వుడ్, సుయశ్‌ శర్మ.