Site icon NTV Telugu

Virat Kohli: మనోడైనా, పగోడైనా.. కోహ్లీతో అట్లుంటది మరి!

Virat Kohli, Shreyas Iyer

Virat Kohli, Shreyas Iyer

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో తన అద్భుత బ్యాటింగ్‌తో అలరించే విరాట్.. సంబరాలు చేసుకోవడంలోనూ ముందుంటాడు. అది మనోడైనా, పగోడైనా.. కోహ్లీ ప్రతీకార సెలెబ్రేషన్స్ మరో లెవల్లో ఉంటాయి. ఇది మరోసారి రుజువైంది. ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌పై కింగ్ తన ప్రతీకారం తీర్చుకున్నాడు.

ఇటీవల బెంగళూరును దాని సొంతగడ్డ చిన్నస్వామిలో పంజాబ్‌ కింగ్స్‌ ఓడించింది. ఆర్సీబీ ఓడాక శ్రేయస్‌ అయ్యర్ గట్టిగానే సంబరాలు చేసుకున్నాడు. అప్పుడు శ్రేయస్‌ను చూసిన విరాట్ ఏమీ అనకుండా ఉండిపోయాడు. ఆదివారం పంజాబ్‌ను దాని సొంతగడ్డపై బెంగళూరు చిత్తుగా ఓడించడంతో విరాట్‌ రెచ్చిపోయాడు. జితేష్ శర్మ విన్నింగ్స్ షాట్ ఆడగానే.. శ్రేయస్‌ వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు. ఇది చూసిన శ్రేయస్‌ తలాడిస్తూ ముందుకు రాగా.. విరాట్ నవ్వుతూ అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కోహ్లీతో అట్లుంటది మరి’, ‘మనోడైనా, పగోడైనా ఒక్కడే’ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఆల్‌రౌండ్‌ ఆధిపత్యంతో పంజాబ్‌ కింగ్స్‌ను బెంగళూరు మట్టికరిపిస్తూ అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ముందుగా పంజాబ్‌ 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్‌ (33; 17 బంతుల్లో 5×4, 1×6), శశాంక్‌ సింగ్‌ (31 నాటౌట్‌; 33 బంతుల్లో 1×4) రాణించారు. కృనాల్‌ (2/25), సుయశ్‌ శర్మ (2/26), తలో రెండు వికెట్స్ పడగొట్టారు. లక్ష్యాన్ని బెంగళూరు 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్‌ కోహ్లీ (73 నాటౌట్‌; 54 బంతుల్లో 7×4, 1×6), దేవదత్ పడిక్కల్‌ (61; 35 బంతుల్లో 5×4, 4×6) హాఫ్ సెంచరీలు బాదారు.

Exit mobile version