Site icon NTV Telugu

MS Dhoni: కొత్తలో ఆ రూల్ నచ్చలేదు.. ఇప్పటికీ నాకు అవసరం లేదు!

Ms Dhoni Csk

Ms Dhoni Csk

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ వచ్చిన కొత్తలో తనకు అస్సలు నచ్చలేదని, అవసరం లేదనిపించిందని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపారు. ఆటలో పాలుపంచుకోవడం తనకు ఇష్టం అని, ఇప్పటికీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ తనకు అవసరం లేదన్నారు. ఇంపాక్ట్ రూల్ వల్ల మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయని చాలా మంది అనడంలో నిజం లేదని, ఆటగాళ్ల మైండ్‌ సెట్ మారడంతోనే పెద్ద స్కోర్స్ సాధ్యమవుతున్నాయని ధోనీ చెప్పుకొచ్చారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ని ఐపీఎల్ 2023లో ప్రవేశపెట్టారు. ఈ రూల్‌ వల్ల అదనంగా ఒక బ్యాటర్‌ లేదా బౌలర్‌ను ఆడించే అవకాశం ఉంటుంది.

‘జియోస్టార్’తో ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ… ‘ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను అమలు చేసిన కొత్తలో అవసరం లేదని నేను భావించాను. ఒక విధంగా ఈ రూల్‌ నాకు సహాయపడుతుంది. కానీ నాకు దాని అవసరం లేదు. నేను ఇప్పటికీ కీపింగ్ చేస్తాను కాబట్టి నేను ఇంపాక్ట్ ప్లేయర్‌ని కాదు. ఆటలో పాలుపంచుకోవడమీ నాకు ఇష్టం. ఇంపాక్ట్ రూల్ వల్ల భారీ స్కోర్లు నమోదవుతున్నాయని చాలా మంది అంటున్నారు. పిచ్‌ పరిస్థితులు,ప్లేయర్ల కాన్ఫిడెన్స్‌ కారణంగానే భారీ స్కోర్లు నమోదవుతున్నాయని నేను నమ్ముతున్నా. అదనపు బ్యాటర్ ఉన్నాడనే ధైర్యంతో ప్లేయర్స్ భయం లేకుండా, దూకుడుగా ఆడుతున్నారు. ఈ రూల్ ముందుగా వచ్చే ప్లేయర్ల ఆట తీరును మార్చేస్తోంది’ అని అన్నారు.

Also Read: KL Rahul: కేఎల్ రాహుల్‌కు ప్రత్యేక విషెష్ చెప్పిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్.. వీడియో వైరల్!

ఐపీఎల్ 2025లో ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతున్న సంగతి తెలిసిందే. 43 ఏళ్ల వయసులోనూ కీపర్‌గా అదరగొడుతున్నారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ను మెరుపు స్టంపింగ్‌ చేసి.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. యువ కీపర్‌ రిషబ్ పంత్ కూడా మహీ అంత వేగంగా క్రీజులో కదలలేకపోతున్నాడు. అంతేకాదు పంత్ తప్పిదం కారణంగా లక్నో మ్యాచ్ కూడా ఓడింది. దాంతో అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది. ఇక చెన్నై తర్వాతి మ్యాచ్‌లో మార్చి 27న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.

Exit mobile version