NTV Telugu Site icon

Mohammed Siraj: ఆర్సీబీ, కోహ్లీని వీడటంపై మహ్మద్‌ సిరాజ్ ఏమన్నాడంటే?

Mohammed Siraj Rcb

Mohammed Siraj Rcb

టీమిండియా పేసర్, హైదరాబాద్ ఆటగాడు మహ్మద్‌ సిరాజ్‌ ఏడేళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఆడిన విషయం తెలిసిందే. ఆర్సీబీలో కీలక ఆటగాడిగా ఉన్న సిరాజ్‌ను ఐపీఎల్ 2025 వేలంలో ఆ ప్రాంచైజీ రిటైన్‌ చేసుకోలేదు. వేలంలో గుజరాత్ టైటాన్స్‌ అతడిని రూ.12.50 కోట్లకు కొనుగోలు చేసింది. కొన్నేళ్లుగా ఆర్సీబీ జట్టు ఆటగాళ్లతో మంచి అనుబంధం ఉన్న సిరాజ్.. ప్రాంచైజీని వీడటంపై తాజాగా స్పందించాడు. విరాట్ కోహ్లీ తనకు మద్దతుగా నిలిచాడని, ఆర్సీబీని వీడటం తనను భావోద్వేగానికి గురిచేసిందన్నాడు.

‘ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు గుజరాత్‌ టైటాన్స్‌లో చేరడం సంతోషాన్ని కలిగిస్తోంది. అయితే కష్ట సమయాల్లో విరాట్ కోహ్లీ నాకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉన్నాడు. అందుకే ఆర్సీబీ నుంచి వైదొలగడం కొంత భావోద్వేగానికి గురి చేసింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో మాకు ఇక్కడ మంచి జట్టు ఉంది. మంచి ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం. మొదటి మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నా’ అని మహ్మద్‌ సిరాజ్ చెప్పాడు. ఏడు సీజన్ల పాటు ఆర్సీబీకి ఆడిన సిరాజ్‌కు విరాట్ కోహ్లీతో మంచి అనుబంధం ఉంది. విరాట్ సూచనలతో మనోడు ఎన్నో వికెట్లు పడగొట్టాడు.

కరోనా మహమ్మారి సమయంలో బంతికి ఉమ్మి రావడాన్ని బీసీసీఐ నిషేదించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసింది. దీనిపై మహ్మద్‌ సిరాజ్ మాట్లాడుతూ… ‘బౌలర్లకు ఇదో అద్భుత వార్త. బంతిపై ఉమ్మి రాయడం వల్ల రివర్స్ స్వింగ్‌ని రాబట్టే అవకాశాలు పెరుగుతాయి. రివర్స్‌ స్వింగ్ కోసం బంతిని ప్యాంట్‌కు ఎంత రుద్దినా ఉపయోగం లేదు. ఉమ్మి పూసి రుద్దడం వల్ల బంతి ఓ వైపు మెరుస్తుంది. అప్పుడు బంతిపై పేసర్లకు పట్టు దొరుకుతుంది’ అని పేర్కొన్నాడు.