Site icon NTV Telugu

MI vs SRH: మెరిసిన జాక్స్, రికిల్‌టన్‌.. సన్‌రైజర్స్‌పై ముంబై విజయం! ప్లేఆఫ్స్‌ రేసులో ఎంఐ

Mumbai Indians

Mumbai Indians

సొంతగడ్డపై బంతితో, బ్యాటుతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో గెలిచింది. 163 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో మూడో విజయాన్ని అందుకుని ప్లేఆఫ్స్‌ రేసులో ఉంది. మరోవైపు ఆడిన 7 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించిన సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌ చేరడం దాదాపుగా కష్టమే.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (40; 28 బంతుల్లో 7×4), హెన్రిచ్ క్లాసెన్‌ (37; 28 బంతుల్లో 3×4, 2×6) రాణించారు. ట్రావిస్‌ హెడ్‌ (28) నెమ్మదిగా ఆడగా, ఇషాన్‌ కిషన్‌ (2) మరోసారి విఫలమయ్యాడు. తెలుగు ఆటగాడు నితీశ్‌ రెడ్డి (19) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. ఇన్నింగ్స్ చివరలో అనికేత్‌ (18 నాటౌట్‌), ప్యాట్ కమిన్స్‌ (8 నాటౌట్‌) దూకుడుగా ఆడి స్కోరు 160 దాటించారు. ముంబై బౌలర్లు విల్‌ జాక్స్‌ (2/14), జస్ప్రీత్ బుమ్రా (1/21), ట్రెంట్ బౌల్ట్‌ (1/29)లు హైదరాబాద్‌ బ్యాటర్లను కట్టడి చేశారు.

ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విల్‌ జాక్స్‌ (36; 26 బంతుల్లో 3×4, 2×6), రికిల్‌టన్‌ (31; 23 బంతుల్లో 5×4) మెరుపులు మెరిపించారు. రోహిత్‌ శర్మ (26; 16 బంతుల్లో 3×6) దూకుడుగా ఆడాడు. రికిల్‌టన్‌, రోహిత్ అనంతరం సూర్య కుమార్ యాదవ్ (26; 15 బంతుల్లో 2×4, 2×6) స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ముంబై తేలిగ్గా విజయం అందుకుంటుందనుకుంటుండగా.. సూర్య, జాక్స్‌ను కమిన్స్‌ స్వల్ప వ్యవధిలో ఔట్‌ చేశాడు. హార్దిక్‌ పాండ్యా (21; 9 బంతుల్లో 3×4, 1×6), తిలక్‌వర్మ (21 నాటౌట్‌; 17 బంతుల్లో 2×4) పని పూర్తి చేశారు.

Exit mobile version