NTV Telugu Site icon

KL Rahul-LSG: ఊహాగానాలకు చెక్‌.. లక్నోతోనే కేఎల్ రాహుల్!

Kl Rahul Sanjiv Goenka

Kl Rahul Sanjiv Goenka

KL Rahul With LSG in IPL 2025: ఐపీఎల్ 2024 సందర్భంగా భారత స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌పై లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) ఫ్రాంచైజీ ఓనర్‌ సంజీవ్ గొయెంకా తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. మే 8న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో లక్నో దారుణంగా ఓడిపోవడంతో.. ఎల్‌ఎస్‌జీ కెప్టెన్ రాహుల్‌తో గోయెంకా కోపంగా మాట్లాడుతున్నట్లున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్టేడియంలో అభిమానులు, కెమెరాల ముందే రాహుల్‌ను తిట్టడం అప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది.

సంజీవ్ గొయెంకా చేసింది ఘోరమైన తప్పిదం అని భారత మాజీ క్రికెటర్లు చాలామంది పేర్కొన్నారు. ఓటమికి కేఎల్‌ రాహుల్‌ బాద్యుడు అని అనుకుంటే.. మైదానంలో కాకుండా డ్రెసింగ్ రూమ్‌లో మాట్లాడాల్సిందన్నారు. గొయెంకా తిట్టడం, ఐపీఎల్‌ 2024లో లక్నో వైఫల్యం నేపథ్యంలో రాహుల్‌ వేరే ఫ్రాంఛైజీకి వెళ్తాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తాజాగా ఆ ఊహాగానాలకు చెక్‌ పడినట్లే కనిపిస్తోంది. రాహుల్‌, గోయెంకా తాజాగా కలవడమే ఇందుకు కారణం.

Also Read: iphone 16 Launch: ఐఫోన్‌ 16 సిరీస్‌ లాంచ్ డేట్ వచ్చేసింది.. యాపిల్‌ ప్రియులకు పండగే ఇగ!

సోమవారం లక్నో యజమాని సంజీవ్‌ గోయెంకాను ఆ జట్టు సారథి కేఎల్‌ రాహుల్‌ కలిశాడు. ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకున్న ఫొటోస్.. నెట్టింట వైరల్ అయ్యాయి. సంజీవ్‌, రాహుల్ కలయిక అన్ని ఊహాగానాలకు చెక్‌ పెట్టింది. గత మూడేళ్ల నుంచి రాహుల్‌ ఎల్‌ఎస్‌జీతోనే ఉన్న విషయం తెలిసిందే. ఇక లక్నో మెంటర్‌గా టీమిండియా మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ను నియమిస్తారనే వార్తల నేపథ్యంలో ఇద్దరి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.